యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను. అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచిమనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో–యెహోవా వాక్కు ఏదనగా–నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము. అయితే–వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు; అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి–చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి. అప్పుడు మోషే–ఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీమధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధనమందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు. అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి.
Read సంఖ్యాకాండము 14
వినండి సంఖ్యాకాండము 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సంఖ్యాకాండము 14:20-45
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు