సంఖ్యాకాండము 14:20-45
సంఖ్యాకాండము 14:20-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను. అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచిమనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో–యెహోవా వాక్కు ఏదనగా–నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము. అయితే–వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు; అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి–చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి. అప్పుడు మోషే–ఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీమధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధనమందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు. అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి.
సంఖ్యాకాండము 14:20-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా “నీ కోరిక ప్రకారం నేను క్షమించాను. కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు, ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు. కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి” అన్నాడు. ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ, “నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను. నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను. మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు. యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు. కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు. మీ విషయంలో మాత్రం, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి. మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడతారు. ఈ అరణ్యం మీ శరీరాలను చంపే వరకూ మీ తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను వారు భరించాలి. మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు” అన్నాడు. మోషే పంపినప్పుడు ఆ దేశంలో సంచారం చేసి చూడడానికి వెళ్లి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సమాజం అంతా అతని మీద తిరుగుబాటు చేసిన మనుషులు, అంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు వల్ల చనిపోయారు. అయితే ఆ దేశం సంచారం చేసి చూసిన మనుషుల్లో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బ్రతికారు. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా దుఃఖపడ్డారు. వారు ఉదయాన లేచి ఆ కొండ శిఖరం ఎక్కి “మనం నిజంగా పాపం చేశాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. యెహోవా మనకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్దాం” అన్నారు. కాని మోషే “మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? దాన్ని మీరు సాధించ లేరు. యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు. మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు” అని చెప్పాడు. కాని వారు మూర్ఖంగా ఆ కొండ కొన మీదకు ఎక్కి వెళ్ళారు. కాని, యెహోవా నిబంధన మందసం గానీ, మోషే గానీ శిబిరం నుంచి బయటకు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిపై దాడి చేసి, హోర్మా వరకూ వారిని తరిమి హతం చేశారు.
సంఖ్యాకాండము 14:20-45 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నీవు అడిగినట్టే నేను ఈ ప్రజలను క్షమించాను. అయితే సత్యం ఏమిటో నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, నా శక్తి ఈ భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నాను. ఈజిప్టు నుండి నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఏ ఒక్కరూ ఆ కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన మహా సూచనలను, నా మహిమను చూసారు ఆ ప్రజలు. అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్లు నన్ను శోధించారు. వారి పూర్వీకులకు ఆ గొప్ప దేశాన్ని ఇస్తానని నేను వాగ్ధానం చేసాను. అయితే నాకు ఇలాంటి కీడు చేసిన ఏ వ్యక్తి ఎన్నటికీ ఆ దేశంలో ప్రవేశించడు. కానీ నా సేవకుడైన కాలేబు విషయం వేరు. అతడు పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు చూసిన ఆ దేశంలోకి అతడ్ని తీసుకెళ్తాను. అతని మనుష్యులకు ఆ దేశం దొరుకుతుంది. అమాలేకీ, కనానీ ప్రజలు లోయలో నివసిస్తున్నారు. రేపు ఈ చోటు విడిచి, తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యానికి వెళ్లండి.” మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను. కనుక వారితో ఇలా చెప్పు, మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే, ఈ అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లంతా మన ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానైన నా మీద ఫిర్యాదు చేసారు. కనుక మీలో ప్రతి ఒక్కరు అరణ్యంలోనే చస్తారు. మీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో మీరు ఒక్కరుకూడా ప్రవేశించరు. యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశిస్తారు. మీరు భయపడి, ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకొని వెళ్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు. మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. “మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు ఈ అరణ్యంలోనే పడి పోతాయి. మీ పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవిస్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు.” “నేను యెహోవాను, నేనే మాట్లాడాను. ఈ దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీరంతా కలిసి నామీదికి వచ్చారు. అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.” ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపించిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఆ దేశంలో ప్రవేశించటానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే చెప్పారు. ఇశ్రాయేలు ప్రజల్లో కష్టాలు వ్యాపించటానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్లందర్నీ చంపేయటానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా. అయతే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డవాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెపున్నె కుమారుడైన కాలేబు కూడ ఉన్నారు. యెహోవా వాళ్లిద్దర్నీ రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవునట్లు చేసిన రోగం వారికి రాలేదు. ఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు. మర్నాడు ఉదయాన్నే ప్రజలు కొండల దేశానికి బయల్దేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. మేము యెహోవా మీద నమ్మకం ఉంచనందుకు మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్తాము” అన్నారు. కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం కలుగదు. మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా ఓడించేస్తారు. అక్కడ అమాలేకీయులు, కనానీయులు మీతో పొరాడుతారు. మీరు యెహోవానుండి వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. మీరంతా వారి ఖడ్గాలతో చంపబడతారు.” కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే ఆ కొండల దేశంవైపు వెళ్లారు. అయితే మోషేగాని, యెహోవా ఒడంబడిక పెట్టెగాని వారితో వెళ్లలేదు. అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలమీద దాడిచేసారు. అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు తేలికగా వీరిని ఓడించి, హోర్మా వరకు వారిని తరిమికొట్టారు.
సంఖ్యాకాండము 14:20-45 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా జవాబిస్తూ, “నీవడిగినట్టే, నేను వారిని క్షమించాను. అయినా, నా జీవం తోడు, యెహోవా మహిమ భూమంతటిని నింపునట్లు, నా మహిమను, ఈజిప్టులోను, అరణ్యంలోను నేను చూపిన సూచనలను చూసి నాకు లోబడక, నన్ను పదిసార్లు పరీక్షించిన ఏ ఒకరు, వారి పూర్వికులకు నేను వాగ్దానంగా ప్రమాణం చేసిన దేశాన్ని వారిలో ఏ ఒక్కరు ఎప్పటికిని చూడరు. నా పట్ల ధిక్కారంగా ప్రవర్తించిన వారెవ్వరూ ఎప్పటికీ చూడరు. అయితే నా సేవకుడు కాలేబు భిన్నమైన ఆత్మ కలిగి ఉండి నన్ను హృదయమంతటితో వెంబడిస్తున్నందుకు, అతడు వెళ్లిన దేశంలోకి నేను అతన్ని తీసుకువస్తాను, అతని వారసులు దానిని స్వతంత్రించుకుంటారు. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: “ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను. కాబట్టి వారికి చెప్పండి, ‘నా జీవం తోడు, మీరు సణుగులను నేను విన్న ప్రకారం నేను మీకు చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు: ఈ అరణ్యంలో మీ శవాలు రాలిపోతాయి అనగా ఇరవై సంవత్సరాలకు పైబడి జనాభా లెక్కలో నమోదై యుండి, నాకు వ్యతిరేకంగా సణిగిన ప్రతి ఒక్కరు రాలిపోతారు. నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు. దోచుకోబడతారని నీవు చెప్పిన నీ పిల్లల విషయానికొస్తే, నీవు తిరస్కరించిన భూమిని అనుభవించడానికి నేను వారిని తీసుకువస్తాను. మీ విషయానికొస్తే, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి. మీ పిల్లలు ఇక్కడ నలభై సంవత్సరాలు కాపరులుగా ఉంటారు, మీలో చివరి శవం ఈ అరణ్యంలో రాలిపోయే వరకు, మీ నమ్మకద్రోహాన్ని బట్టి మీ వ్యభిచారశిక్షను భరిస్తారు. నలభై సంవత్సరాల వరకు మీరు దేశాన్ని వేగు చూసిన ప్రతి నలభై రోజులకు ఒక సంవత్సరం, మీ దోషశిక్షను మీరు భరించి నేను మీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు.’ యెహోవానగు నేనే స్వయంగా చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా పోగయిన ఈ దుష్ట సమాజం మొత్తానికి, నేను ఖచ్చితంగా ఇవి చేస్తాను. ఈ అరణ్యంలో వారు అంతరిస్తారు; ఇక్కడ వారు చస్తారు.” మోషే, ఆ దేశాన్ని పరిశీలించండి, అని పంపిన మనుష్యులు, వెళ్లి తిరిగివచ్చి దాని గురించి తప్పుడు నివేదిక తెచ్చి సమర్పించి, సర్వసమాజం సణుగునట్లు చేశారు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి బాధ్యులైన వీరు మొత్తబడి, యెహోవా ఎదుట తెగులు ద్వార చనిపోయారు. ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు. మోషే ఇశ్రాయేలీయులందరికి ఈ విషయం చెప్పినప్పుడు, వారు చాలా ఏడ్చారు. మరుసటిరోజు ఉదయాన్నే వారు, “నిజంగా మేము పాపం చేశాము. ఇప్పుడు మేము యెహోవా వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం!” అని అంటూ, కొండసీమ మీదున్న ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు. కానీ మోషే, “ఎందుకు మీరు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు? ఇదిలా కొనసాగదు! యెహోవా మీతో లేడు కాబట్టి మీరు వెళ్లకండి. మీరు శత్రువుల చేతిలో ఓడిపోతారు, ఎందుకంటే అమాలేకీయులు, కనానీయులు అక్కడ మీ మీదికి వస్తారు, మీరు వారి ఖడ్గం చేత చస్తారు. ఎందుకంటే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన మీతో ఉండరు” అని చెప్పాడు. అయినాసరే, వారు అహంకారంతో మోషే గాని, యెహోవా నిబంధన మందసం గాని శిబిరం నుండి కదలక పోయినా, కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు. అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు.