లేవీయకాండము 9
9
1ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి 2అహరోనుతో ఇట్లనెను–నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము. 3మరియు నీవు ఇశ్రాయేలీయులతో–మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను 4సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. 5మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా 6మోషే–మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. 7మరియు మోషే అహరోనుతో ఇట్లనెను–నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. 8కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను. 9అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. 10దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 11దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. 12అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను. 13మరియు వారు దహన బలిపశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠముమీద వాటిని దహించెను. 14అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను. 15అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను. 16అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను. 17అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసినదానిని దహించెను. 18మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టుదానిని ప్రోక్షించెను. 19మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి. 20బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను. 21బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 22అప్పుడు అహరోను పాప పరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. 23మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. 24యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయకాండము 9: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.