లేవీయకాండము 8

8
1మరియు యెహోవా 2–నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని 3ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా 4యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు కూడిరాగా 5మోషే సమాజముతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. 6అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. 7తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి 8ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి 9అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 10మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. 11అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠముమీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. 12మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. 13అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను. 14ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి. 15దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను. 16మోషే ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠముమీద దహించెను. 17మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. 18తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి. 19అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను. 20అతడు ఆ పొట్టేలుయొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. 21అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి, ఆ పొట్టేలంతయు బలిపీఠముమీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది యింపైన సువాసనగల దహనబలి ఆయెను. అది యెహోవాకు హోమము. 22అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొనిరాగా అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి. 23మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. 24మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి, వారి కుడిచెవుల కొనలమీదను వారి కుడిచేతుల బొట్టనవ్రేలిమీదను వారి కుడి కాళ్ల బొట్టనవ్రేలిమీదను ఆ రక్తములో కొంచెము చమి రెను. మరియు మోషే బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను 25తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి 26యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి 27అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. 28అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలిపీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము. 29మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 30మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠముమీది రక్తములో కొంతయు తీసి, అహరోనుమీదను అతని వస్త్రములమీదను అతని కుమారులమీదను అతని కుమారుల వస్త్రములమీదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. 31అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను–ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠితద్రవ్యములుగల గంపలోని భక్ష్యములను తినవలెను. 32ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. 33మీ ప్రతిష్ఠదినములు తీరువరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును. 34మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. 35మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. 36యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయకాండము 8: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for లేవీయకాండము 8