యెహోషువ 9
9
1యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అనువారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు 2వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి. 3యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబియోను నివాసులు వినినప్పుడు 4వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసికొని 5పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను. 6వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి–మేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా 7ఇశ్రాయేలీయులు–మీరు మామధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి. 8వారు–మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ–మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా 9వారు–నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చితిమి; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న 10హెష్బోనురాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషానురాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. 11అప్పుడు మా పెద్దలును మా దేశ నివాసులందరును మాతో–మీరు ప్రయాణముకొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో–మేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి. 12మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా యిండ్లనుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను. 13ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి. 14ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా 15యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. 16అయితే వారితో నిబంధన చేసి మూడుదినములైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి.
17ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి. 18సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి. 19అందుకు సమాజ ప్రధానులందరు సర్వసమాజముతో ఇట్లనిరి–మనము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హానిచేయకూడదు. 20మనము వారితో చేసిన ప్రమాణమువలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమునుబట్టి వారిని బ్రదుక నియ్యవలెనని చెప్పి 21వారిని బ్రదుకనియ్యుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లువారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. 22మరియు యెహోషువ వారిని పిలిపించి యిట్లనెను–మీరు మామధ్యను నివసించువారై యుండియు–మేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి? 23ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు. 24అందుకు వారు యెహోషువను చూచి–నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితిమి. 25కాబట్టి మేము నీ వశముననున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. 26కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను. 27అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 9: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.