యెహోషువ 10
10
1యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు; అతడు యెరికోను దాని రాజును నిర్మూలముచేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలముచేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధిచేసికొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి. 2ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకు–గిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని 3-4హెబ్రోనురాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోనురాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను. 5కాబట్టి అమోరీయుల అయిదుగురు రాజులును, అనగా యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి. 6గిబియోనీయులు–మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహాయముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా 7యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి. 8అప్పుడు యెహోవా–వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా 9యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగా పడెను. 10అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‍హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. 11మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‍హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మంది యయిరి.
12యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను–
సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము.
చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము.
జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు
సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను.
అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి
యున్నది గదా.
13–సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచియించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. 14యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. 15అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి.
16ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి. 17మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషు వకు తెలుపబడినప్పుడు 18యెహోషువ–ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి. 19మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండ మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటివారిని కొట్టివేయుడనెను. 20వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును బహుజనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి. 21జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. 22యెహోషువ–ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా 23వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి. 24వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతులతో–మీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి. 25అప్పుడు యెహోషువ వారితో–మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. 26తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని వ్రేలాడదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను. 27ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.
28ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
29యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి. 30యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను.
31అంతట యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా 32యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవదినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
33లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను. 34అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకు వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి 35ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారినందరిని ఆ దినము నిర్మూలముచేసెను.
36అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి 37దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను.
38అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి 39దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
40అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియులేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. 41కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషెను దేశమంతటిని యెహోషువ జయించెను. 42ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నందరిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. 43తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 10: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.