యెహోషువ 23
23
1చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను. 2అప్పుడతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను–నేను బహు సంవ త్సరములు గడచిన ముసలివాడను. 3మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. 4చూడుడి, యొర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రమువరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని. 5మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువకుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు. 6కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక 7మీయొద్ద మిగిలియున్న యీ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక 8మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను. 9యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుటనుండి కొట్టివేసియున్నాడు, మీ యెదుట నేటివరకును ఏ మనుష్యుడును నిలిచియుండలేదు. 10మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును 11కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
12అయితే మీరు వెనుకకు తొలగి మీయొద్ద మిగిలియున్న యీ జనములను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసినయెడల 13మీ దేవుడైన యెహోవా మీ యెదుటనుండి యీ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ మీరు నశించువరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కలమీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు. 14ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచిమాటలన్ని టిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు. 15అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును. 16మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరించినయెడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన యీ మంచి దేశములో నుండకుండ మీరు శీఘ్రముగా నశించి పోవుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.