యెహోషువ 20
20
1మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చిన దేమనగా 2-3–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషేనోట మీతో పలికించిన ఆశ్రయ పురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్యవిషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. 4ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి, ఆ పురముయొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. 5హత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకుమునుపు వానియందు పగపట్టలేదు. 6అతడు తీర్పునొందుటకై సమాజము నెదుట నిలుచువరకును, తరువాత ఆ దినములలోనున్న యాజకుడు మరణము నొందువరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణమునుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన యింటికిని తిరిగి రావలెను. 7అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి. 8తూర్పుదిక్కున యొర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములో ని బేసెరును, గాదీయుల గోత్రములోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి. 9పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్యచేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారిమధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 20: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.