యెహోషువ 17
17
1మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్దకుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. 2మనష్షీయులలో మిగిలిన వారికి, అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అశ్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశములచొప్పున వంతువచ్చెను. వారి వంశములనుబట్టి యోసేపు కుమారుడైన మనష్షేయొక్క మగ సంతానమది.
3మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపె హాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి. 4వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధానుల యెదుటికిని వచ్చి–మా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవిచేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రియొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.
5కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను. 6ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. 7మనష్షీయుల సరిహద్దు ఆషేరునుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతావరకును దక్షిణమున ఏన్తప్పూయ నివాసులవైపునకు వ్యాపించెను. 8తప్పూయదేశము మనష్షీయులదాయెను; అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయి మీయులదాయెను. 9ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ యేటివరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను; అయితే మనష్షీయుల సరిహద్దు ఆ యేటికి ఉత్తరముగా సముద్రమువరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును ఉత్తరభూమి మనష్షీయులకును కలిగెను. 10సముద్రము వారి సరిహద్దు; ఉత్తరదిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పుదిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను.
11ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది. 12కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పెట్టి యుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి. 13ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. 14అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో–మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా 15యెహోషువ–మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయులయొక్క మన్యము మీకు ఇరుకుగా నున్నయెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను. 16అందుకు యోసేపు పుత్రులు–ఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయులకందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. 17-18అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి– మీరు ఒక విస్తారజనము, మీకు అధికబలముగలదు, మీకు ఒక్కవంతు చీటియేకాదు; ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదే శము మీదగును; కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీన పరచుకొనగలరనెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 17: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.