యోబు 37

37
1దీనినిబట్టి నా హృదయము వణకుచున్నది
దాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.
2ఆయన స్వరగర్జనమును వినుడి
ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.
3ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును
భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.
4దాని తరువాత ఉరుముధ్వని గర్జించును
ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును
ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును
నిలిపివేయడు
5దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును
మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన
చేయును.
6–నీవు భూమిమీద పడుమని హిమముతోను
వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ
ఇచ్చుచున్నాడు.
7మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును
తెలిసికొనునట్లు
ప్రతిమనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసియున్నాడు.
8జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి
వాటి బిలములలో వసించును.
9మరుగుస్థానములోనుండి తుపాను వచ్చును
ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
10దేవుని ఊపిరివలన మంచు పుట్టును
జలముల పైభాగమంతయు గట్టిపడును.
11మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో
నింపును
తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
12-13ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాస
యోగ్యమైన భూగోళము మీద
మెరుపును మేఘములును సంచారము చేయును
ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును
శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప
చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి
నెరవేర్చును.
14యోబూ, ఈ మాట ఆలకింపుము
ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
15దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని
యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?
16మేఘములను తేలచేయుటయు
పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
17దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు
నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
18పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును
ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?
19మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు
తెలుపుము.
చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది
20నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా?
ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?
21ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ
యిప్పుడు కనబడకయున్నను
గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కను
పరచును.
22ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును
దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.
23సర్వశక్తుడగు దేవుడు
మహాత్మ్యముగలవాడు.
ఆయన మనకు అగోచరుడు.
న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు.
24అందువలన నరులు ఆయనయందు భయభక్తులుకలిగి
యుందురు.
తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును
లక్ష్యపెట్టడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 37: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి