యోహాను 19

19
1అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. 2సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి 3ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి. 4పిలాతు మరల వెలుపలికి వచ్చి–ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను. 5ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు–ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. 6ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి–సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు–ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను. 7అందుకు యూదులు–మాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పు కొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. 8పిలాతు ఆ మాట విని మరి యెక్కు వగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి 9–నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు 10గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను. 11అందుకు యేసు–పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను. 12ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులు–నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి. 13పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. 14ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు–ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా 15అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. 16అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
17వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. 18అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి. 19మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. 20యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. 21–నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా 22పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
23సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్ర్తములు తీసికొని,యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక 24వారు–దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ
కోసరము చీట్లు వేసిరి
అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. 25ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. 26యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, 27తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
28అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను. 29చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. 30యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.
31ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. 32కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. 33వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని 34సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 35ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.
36–అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
37మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు
అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
38అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను. 39మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. 40అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. 41ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను. 42ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందునవారు అందులో యేసును పెట్టిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోహాను 19: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి