యిర్మీయా 33
33
1మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు 3–నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. 4ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా 5కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా 6–నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. 7చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదటనుండినట్లు వారిని స్థాపించుచున్నాను. 8వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను. 9భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికిచేయు సకల ఉపకారములనుగూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలునుబట్టియు భయపడుచు దిగులు నొందుదురు. 10-11యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే, సంతోషస్వరమును ఆనంద శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును–యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును;మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు 12సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. 13మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
14యెహోవా వాక్కు ఇదే–ఇశ్రాయేలు వంశస్థులనుగూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచిమాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. 15ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. 16ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును. 17యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. 18ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. 19మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 20–యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగినయెడల 21నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. 22ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును. 23మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 24తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా. 25యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల 26భూమ్యాకాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 33: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.