న్యాయాధిపతులు 2

2
1యెహోవాదూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకువచ్చి యీలాగు సెలవిచ్చెను–నేను మిమ్మును ఐగుప్తులోనుండి రప్పించి, మీపితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి–నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. 2మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితినిగాని మీరు నా మాటను వినలేదు. 3మీరు చేసినపని యెట్టిది? కావున నేను–మీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. 4యెహోవాదూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా 5జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమను#2:5 అనగా ఏడ్పు. పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి.
6యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. 7యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. 8నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దు లోనున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి. 9అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది.
10ఆ తరమువారందరు తమపితరులయొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా 11ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి 12తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. 13వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. 14కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి. 15యెహోవావారితో చెప్పినట్లు, యెహోవావారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవావారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.
16ఆ కాలమున యెహోవావారికొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక 17తమపితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్క రించిరి; తమపితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లువారు నడవకపోయిరి. 18తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. 19ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి యితర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వికులకంటె మరి మిగుల చెడ్డవారైరి. 20కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను–ఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు 21గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై 22యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి యెదుటనుండి నేను వెళ్లగొట్టను. 23అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్ట కయు మాని వారిని ఉండనిచ్చెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

న్యాయాధిపతులు 2: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి