ఆదికాండము 26:17-35

ఆదికాండము 26:17-35 TELUBSI

ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి–ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు–ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను. అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి. ఇస్సాకు–మీరు నామీద పగపెట్టి మీయొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా వారు–నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి–మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

ఆదికాండము 26:17-35 కోసం వీడియో