ఆదికాండము 26:17-35

ఆదికాండము 26:17-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి–ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు–ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను. అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి. ఇస్సాకు–మీరు నామీద పగపెట్టి మీయొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా వారు–నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి–మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

షేర్ చేయి
Read ఆదికాండము 26

ఆదికాండము 26:17-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి ఇస్సాకు అక్కడనుండి తరలి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు. ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది. అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో “ఈ నీళ్ళు మావే” అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి “ఏశెకు” అని పేరు పెట్టాడు. తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దాని కోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి “శిత్నా” అనే పేరు పెట్టాడు. అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు “యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం” అంటూ ఆ స్థలానికి రహబోతు అనే పేరు పెట్టాడు. అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను.” ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు. ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. వారితో ఇస్సాకు “మీరు నామీద కక్ష కట్టి మీ దగ్గరనుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు. “యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం. మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.” కాబట్టి ఇస్సాకు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు. పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తరువాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు. అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్ళు పడ్డాయని చెప్పారు. ఆ బావికి ఇస్సాకు “షీబా” అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఆ ఊరి పేరు బెయేర్షెబాయే. ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతునూ, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతునూ పెళ్ళి చేసుకున్నాడు. వీరు ఇస్సాకు రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు.

షేర్ చేయి
Read ఆదికాండము 26

ఆదికాండము 26:17-35 పవిత్ర బైబిల్ (TERV)

కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి, గెరారులోని చిన్న నదికి సమీపంలో మజిలీ చేశాడు. ఇస్సాకు అక్కడ నివాసమున్నాడు. దీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీ ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక ఇస్సాకు తిరిగి వెళ్లి, ఆ బావులను మళ్లీ తవ్వాడు. వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు. చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది. అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి “ఏశెకు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు. అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడమాడారు. కనుక ఆ బావికి “శిత్నా” అని ఇస్సాకు పేరు పెట్టాడు. ఇస్సాకు అక్కడనుండి వెళ్లిపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి “రహెబోతు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు. ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు. ఆ రాత్రి ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. “నీ తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వంశస్థులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నేను ఇది చేస్తాను” అని యెహోవా చెప్పాడు. కనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి తవ్వారు. ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. అతడు సలహాదారుడు అహుజతును, సైన్యాధిపతియైన ఫీకోలును వెంటబెట్టుకొని వచ్చాడు. ఇస్సాకు వారితో, “ఇంతకుముందు నీవు నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్లు నీవు నన్ను బలవంతం గూడా చేశావు గదా. ఇప్పుడు నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు. వారు ఇలా జవాబు చెప్పారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభిప్రాయం. మాకు నీవు ఒక ప్రమాణం చేయాలి. మేము నిన్ను బాధించలేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, సమాధానంగా పంపించాం. యెహోవా నిన్ను ఆశీర్వదించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.” ఇస్సాకు వారికి విందు చేశాడు. వారు తిని త్రాగారు. మర్నాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం చేశారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లిపోయారు. ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో నీళ్లు చూశాం” అని సేవకులు చెప్పారు. కనుక ఆ బావికి “షేబ” అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది. ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె బాశెమతు. ఈ వివాహాలు ఇస్సాకు, రిబ్కాలను చాలా బాధపెట్టాయి.

షేర్ చేయి
Read ఆదికాండము 26

ఆదికాండము 26:17-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి ఇస్సాకు అక్కడినుండి గెరారు లోయకు వెళ్లి, గుడారం వేసుకుని అక్కడ స్థిరపడ్డాడు. తన తండ్రి అబ్రాహాము కాలంలో త్రవ్వించిన బావులను అతడు చనిపోయాక ఫిలిష్తీయులు పూడ్చేసిన వాటిని ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు, వాటికి తన తండ్రి పెట్టిన అవే పేర్లు పెట్టాడు. ఇస్సాకు సేవకులు గెరారు లోయలో కూడా త్రవ్వినప్పుడు మంచి నీళ్ల బావి కనుగొన్నారు. అయితే గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో గొడవపడి, “ఈ నీళ్లు మావి!” అని అన్నారు. వారు జగడమాడారు కాబట్టి ఇస్సాకు ఆ బావికి ఏశెకు అని పేరు పెట్టాడు. తర్వాత వారు మరో బావి త్రవ్వారు, కానీ దాని కోసం కూడా గొడవపడ్డారు; కాబట్టి ఆ బావికి శిత్నా అని పేరు పెట్టాడు. అతడు అక్కడినుండి వెళ్లి మరో బావి త్రవ్వించాడు, దాని కోసం ఎలాంటి గొడవ జరగలేదు. అతడు, “ఇప్పుడు యెహోవా మాకు స్థలం ఇచ్చారు, మేము ఈ దేశంలో వర్ధిల్లుతాము” అని ఆ బావికి రహెబోతు అని పేరు పెట్టాడు. అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు. ఆ రాత్రి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, “నేను నీ తండ్రి అబ్రాహాము దేవుడను. భయపడకు, నేను నీతో ఉన్నాను; నా సేవకుడైన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సంఖ్యాపరంగా నీ వారసులను విస్తరింపజేస్తాను” అని అన్నారు. ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. అక్కడ తన గుడారం వేసుకున్నాడు, అక్కడే తన సేవకులు బావి త్రవ్వారు. ఇంతలో అబీమెలెకు, అతని స్నేహితుడు అహుజతు, సేనాధిపతి ఫీకోలు, గెరారు నుండి ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఇస్సాకు వారిని, “మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నాకు వ్యతిరేకంగా ఉంటూ నన్ను పంపివేశారు కదా?” అని అడిగాడు. వారు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము. మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు.” అప్పుడు ఇస్సాకు వారికి విందు చేశాడు, వారు తిని త్రాగారు. మర్నాడు వేకువజామున వారు లేచి, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపాడు, వారు అక్కడినుండి సమాధానంతో వెళ్లారు. ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి అతనితో వారు త్రవ్విన మరో బావి గురించి ఇలా చెప్పారు. వారు, “మాకు నీళ్లు కనిపించాయి!” అని చెప్పారు. అతడు ఆ బావికి షేబ అని పేరు పెట్టాడు, అందుకే ఇప్పటివరకు ఆ పట్టణం పేరు బెయేర్షేబ. ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.

షేర్ చేయి
Read ఆదికాండము 26