ఆదికాండము 26

26
1అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను. 2అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై–నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. 3ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను; 4ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. 5ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.
6-7ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా –రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. 8అక్కడ అతడు చాలాదినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలోనుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను. 9అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి–ఇదిగో ఆమె నీ భార్యయే–ఆమె నా సహో దరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు–ఆమెనుబట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను. 10అందుకు అబీమెలెకు–నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను. 11అబీమెలెకు–ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా 12ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలముపొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. 13అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. 14అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి. 15అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.
16అబీమెలెకు–నీవు మాకంటె బహుబలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా 17ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను. 18అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. 19మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను. 20అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి–ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు#26:20 అనగా – జగడమాడు. అను పేరు పెట్టెను. 21వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా#26:21 అనగా – విరోధము. అను పేరు పెట్టెను. 22అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు–ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు#26:22 అనగా – ఎడము. అను పేరు పెట్టెను. 23-24అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. 25అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. 26అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి. 27ఇస్సాకు–మీరు నామీద పగపెట్టి మీయొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా 28వారు–నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు 29మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. 30అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. 31తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి. 32ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి–మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక 33దానికి షేబ#26:33 అనగా ప్రమాణము. అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
34ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను. 35వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆదికాండము 26: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in