యెహెజ్కేలు 45
45
1మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. 2దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను, 3కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థల ముండును. 4యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు 5ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను. 6మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును. 7మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణము నకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడ మటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణము నకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పువరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు 8అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును.
9మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 10ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. 11తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను. 12తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను. 13ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్ల యవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను. 14తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును. 15మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱెలలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను. 16ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు. 17పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రాయేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడబడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థబలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిద్ధపరచవలెను.
18ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను. 19ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశు రక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను. 20తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెలయేడవ దినమందు ఆలాగు చేయవలెను. 21మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. 22ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను. 23మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడుఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. 24మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపెట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను. 25మరియు ఏడవ నెల పదునైదవదినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆప్రకారముగానే చేయవలెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 45: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.