యెహెజ్కేలు 44
44
1తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను. 2అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును. 3అధిపతి యగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటపమార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికి పోవలెను. 4అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజోమిహమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా 5యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–నరపుత్రుడా, యెహోవా మందిరమునుగూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటనుగూర్చి యోచించుము. 6తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును. 7ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి. 8నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. 9కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు. 10మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. 11అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు. 12విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 13తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు; వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతిపరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. 14అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను.
15ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 17వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చునప్పుడు జనుపనారబట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మములద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్ల బొచ్చుచేత చేసిన బట్టలువారు ధరింపకూడదు. 18అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు. 19బయటి ఆవరణములోనికి జనులయొద్దకు వారు వెళ్లునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుటచేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు, తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి, వేరు బట్టలు ధరింపవలెను, 20మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తలవెండ్రుకలు పెరుగ నియ్యక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. 21లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు. 22వారు విధవ రాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొనకూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసికొనవచ్చును. 23ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు 24జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతిదినములను ఆచరించుదురు. 25తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడకూడదు. 26ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి 27పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 28వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము. 29నైవేద్యములును పాపపరిహారార్థబలిమాంసమును అపరాధ పరిహారార్థబలిమాంసమును వారికి ఆహారమవును, ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నియు వారివి. 30మీ ప్రతిష్ఠి తార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులవగును; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను. 31పక్షులలోను పశువులలోను తనకుతాను చచ్చినదానినిగాని చీల్చబడినదానిని గాని యాజకులు భుజింపకూడదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 44: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.