యెహెజ్కేలు 20
20
1ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవదినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా 2యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 3–నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము – ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 4వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము. 5ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున 6వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని. 7అప్పుడు–నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని. 8అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నాకోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని. 9అయితే ఏ అన్యజనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించితిని. 10వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి 11వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటిననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును. 12మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని. 13అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. 14అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో యే అన్యజనులలోనుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. 15మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా 16ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని. 17అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని. 18వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని–మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. 19మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి. 20నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును. 21అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నాకోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని. 22అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులమధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. 23-24మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి, తమపితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని. 25నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలముకాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని. 26తొలిచూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.
27కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీపితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి 28వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. 29మీరు పోవుచున్న ఉన్నతస్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది. 30కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీపితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే; 31నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు 32–అన్యజనులేమి భూమిమీది యేజనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు. 33నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను. 34మరియు నేను రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండియు జనులలోనుండియు నేను మిమ్మును సమ కూర్చి 35జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు. 36ఐగుప్తీయులదేశపు అరణ్యములో నేను మీపితరులతో వ్యాజ్యెమాడినట్టు మీతోను వ్యాజ్యె మాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 37చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. 38మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపురమున్న దేశములోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లువారు ఇశ్రాయేలుదేశములో ప్రవేశించరు. 39ఇశ్రాయేలు యింటివారలారా, మీరు నామాట వినని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి, గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 40నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధపర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను. 41జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీమధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. 42మీపితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు. 43అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటిని మనస్సునకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు. 44ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీకీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
45ఇదే యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 46–నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్యమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము 47–దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. 48అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైనజనులకు తెలియబడును. 49అయ్యో ప్రభువా యెహోవా–వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్నుగూర్చి చెప్పుదురని నేనంటిని.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 20: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.