నిర్గమకాండము 23

23
1లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు; 2దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించ వద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు; 3వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు.
4నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. 5నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
6దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు 7అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. 8లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. 9పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.
10ఆరుసంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 11ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను. 12ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవదినమున ఊరక యుండవలెను. 13నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.
14సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను. 15పులియనిరొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు. 16నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంటయొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను. 17సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.
18నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయమువరకు నిలువ యుండకూడదు. 19నీ భూమి ప్రథమఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
20ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. 21ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. 22అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. 23ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. 24వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. 25నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను. 26కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తిచేసెదను. 27నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశములవారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను. 28మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టును. 29దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను. 30నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను. 31మరియు ఎఱ్ఱసముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రమువరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు. 32నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొన వద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక 33వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లువారు నీ దేశములో నివసింపకూడదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 23: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

నిర్గమకాండము 23 కోసం వీడియో