ద్వితీయోపదేశకాండము 4

4
1కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీపితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. 2మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు. 3బయల్పెయోరు విషయములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతిమనుష్యుని నీ దేవుడైన యెహోవా నీమధ్యను ఉండకుండ నాశనము చేసెను. 4మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు. 5నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. 6ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి–నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు. 7ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? 8మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది? 9అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి 10నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి యుండగా యెహోవా–నా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము. 11అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా 12యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. 13మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను. 14అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞా పించెను. 15హోరేబులో యెహోవా అగ్నిజ్వాలలమధ్యనుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. 16కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను 17ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను 18నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశమువైపు కన్నులెత్తి 19సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. 20యెహోవా మిమ్మును చేపెట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయజనముగా నుండుటకై, ఐగుప్తుదేశములోనుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను. 21మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాట కూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చు చున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. 22కావున నేను ఈ యొర్దాను దాటకుండ ఈ దేశముననే చనిపోదును; మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు. 23మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను. 24ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
25మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల 26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. 27మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. 28అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. 29అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. 30ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల 31నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. 32దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగానుండినమునుపటి దినములలో ఆకాశముయొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము 33నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా? 34మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా? 35అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను. 36నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాటలను నీవు వింటిని. 37ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. 38నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు గానుండి ఐగుప్తులోనుండి తన మహాబలముచేత నిన్ను వెలుపలికి రప్పించెను. 39కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము 40మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
41అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల 42చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేని లోనికినైనను పారిపోయి బ్రదుకును. 43అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీ యులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
44మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది. 45ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చుచుండగా 46యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుదేశమందు 47మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి. 48మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కున నున్న బాషానురాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమోరీయుల యిద్దరు రాజులదేశమును, 49పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను ఇవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీన పరచుకొనిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి