ద్వితీయోపదేశకాండము 3

3
1మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషానురాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా 2యెహోవా నాతో ఇట్లనెను–అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను. 3అట్లు మన దేవుడైన యెహోవా బాషానురాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియులేకుండ అతనిని హతము చేసితిమి. 4ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియులేదు. బాషానులో ఓగురాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి. 5ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియుగాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి. 6మనము హెష్బోనురాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి; 7వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి. 8ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి. 9సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు. 10మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషా నును పట్టుకొంటిమి. 11రెఫాయీయులలో బాషానురాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు. 12అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. 13ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని. 14మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయులయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి. 15మాకీరీయులకు గిలాదు నిచ్చితిని. 16గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును 17కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.
18ఆ కాలమందు నేను మిమ్మును చూచి–మీరు స్వాధీన పరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. 19అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చువరకు, 20అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీ కిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును. 21ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని–మీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యముల నన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును. 22మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.
23మరియు ఆ కాలమున నేను–యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు. 24ఆకాశమందేగాని భూమి యందేగాని నీవుచేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? 25నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతి మాలుకొనగా 26యెహోవా మిమ్మునుబట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను–చాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. 27నీవు ఈ యొర్దానును దాటకూడదుగాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము. 28యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును. 29అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 3: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 3