ద్వితీయోపదేశకాండము 34

34
1మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను. 2అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును 3సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను. 4మరియు యెహోవా అతనితో ఇట్లనెను–నీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితినిగాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు. 5యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను. 6బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు. 7మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువ తగ్గలేదు. 8ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. 9మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. 10-11ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో 12వాటి విషయములోను, ఆ బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 34: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 34