దానియేలు 9
9
1మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను. 2అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని. 3అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని. 4నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసి యొప్పుకొన్నదేమనగా–ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయువాడా, 5మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమునుబట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశ జనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక 6నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము. 7ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితిమి; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయదేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. 8ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. 9మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు. 10ఆయన తన దాసులగు ప్రవక్తలద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. 11ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రమునతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక–నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి. 12యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగాఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్పకీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను. 13మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతిమి; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతిమి. 14మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను. 15ప్రభువా మా దేవా, నీవు నీ బాహు బలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము. 16ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను. 17ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడుచేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము. 18నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్ట బడిన యీ పట్టణమును దృష్టించి చూడుము. 19ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
20నేను ఇంక పలుకుచు ప్రార్థనచేయుచు, పవిత్ర పర్వతముకొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. 21నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. 22అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను–దానియేలూ, నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. 23నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనముచేయ నారంభించి నప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము. 24తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను. 25యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు#9:25 మెస్సీయా. అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. 26ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియులేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. 27అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి#9:27 పాడైన దానికి. రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
దానియేలు 9: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.