దానియేలు 10

10
1పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో . మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను. 2ఆ దినములయందు దానియేలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు. 4మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. 5నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను. 6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను 7దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. 8నేను ఒంటరినై యీ గొప్ప దర్శనమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నాయందు నిలువలేదు. 9నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని. 10అప్పుడొకడు చేతితో నన్నుముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి 11–దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని. 12అప్పుడతడు–దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని 13పారసీకుల రాజ్యాధిపతి ఇరువదియొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను, 14ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను. 15అతడీమాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. 16అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని –నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను, 17నా యేలిన వాని దాసుడనైన నేను నా యేలినవానియెదుట ఏలాగున మాటలాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా 18-19అతడు మరల నన్నుముట్టి నన్ను బలపరచి–నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని–నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. 20అతడు–నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధముచేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును. 21అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

దానియేలు 10: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for దానియేలు 10