అపొస్తలుల కార్యములు 22
22
1సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
2అతడు హెబ్రీభాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.
3–నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి 4ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని. 5ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారిని కూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని. 6నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను. 7నేను నేలమీద పడి–సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నా వని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. 8అందుకు నేను–ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన–నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. 9నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు. 10అప్పుడు నేను–ప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువు–నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను. 11ఆ వెలుగుయొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని. 12అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి 13–సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృిష్టిపొంది అతని చూచితిని. 14అప్పుడతడు–మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు; 15నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు. 16గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను. 17అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. 18అప్పుడాయన–నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను. 19అందుకు నేను–ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును. 20మరియు నీ సాక్షి యైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని. 21అందుకు ఆయన–వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
22ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి. 23వారు కేకలువేయుచు తమ పైబట్టలు విదుల్చుకొని ఆకా శముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా 24వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞా పించెను. 25వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి–శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను. 26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతియొద్దకు వచ్చి– నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీ యుడు సుమీ అనెను. 27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి–నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా 28అతడు–అవునని చెప్పెను. సహస్రాధిపతి– నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు–నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను. 29కాబట్టి అతని విమర్శింపబోయినవారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడ భయపడెను.
30మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 22: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.