2 సమూయేలు 13
13
1తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. 2తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను. 3అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు 4–రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నో నుతో అనగా అమ్నోను–నా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. 5యెహోనాదాబు–నీవు రోగివైనట్టు వేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు–నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను. 6అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడవచ్చి నప్పుడు అమ్నోను–నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవిచేయగా 7దావీదు–నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధముచేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. 8కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను. 9అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు–నాకు వద్దని చెప్పి–ఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండనెను. 10వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోను –నీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను. 11అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని–నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా 12ఆమె –నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును? 13నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము; 14అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను. 15అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమెయెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా 16ఆమె–నన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడుచేయకుమని చెప్పినను 17అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి–దీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. 18కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీర యొకటి ధరించి యుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియ వేసెను. 19అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా 20ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచి–నీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊరకుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను. 21ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. 22అబ్షాలోము తన అన్నయగు అమ్నో నుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతనిమీద పగయుంచెను.
23రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్హాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను. 24అబ్షాలోము రాజు నొద్దకు వచ్చి–చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవిచేయగా 25రాజు–నా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. 26అయితే దావీదు వెళ్ల నొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము– నీవు రాకపోయినయెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. –అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా 27అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. 28అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. 29అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారుచేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి. 30వారు మార్గములో ఉండగానే యొకడునులేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్తరాగా 31అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువ బడియుండిరి. 32దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి–రాజకుమారులైన యౌవనులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిననాటనుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చయించుకొనవచ్చును. 33కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను. 34అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి యుండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. 35యెహోనాదాబు–అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారము గానే ఆయెనని రాజుతో చెప్పెను. 36అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి. 37అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను.
38అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత 39రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.#13:39 లేక, అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొనెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 13: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.