2 సమూయేలు 14

14
1రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని#14:1 లేక, రాజుయొక్క మనస్సు అబ్షాలోమునకు విరోధమని. సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి 2తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువనంపించి–ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి 3నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను. 4కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసి–రాజా రక్షించుమనగా 5రాజు–నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె–నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను; 6నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను. 7కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచి–తన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగునవారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైననులేకుండ మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోవుచున్నారని రాజుతో చెప్పగా 8రాజు–నీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. 9అందుకు తెకోవ ఊరి స్త్రీ–నా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా 10రాజు–ఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొని రమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను. 11అప్పుడు ఆమె–రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజు–యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను. 12అప్పుడు ఆ స్త్రీ–నా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు–చెప్పుమనెను. 13అందుకు ఆ స్త్రీ–దేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు. 14మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. 15జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను–రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో 16రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారుని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగునన్ను విడిపించునేమో అనుకొంటిని. 17మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను. 18రాజు–నేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె–నా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను. 19అంతట రాజు–యోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెను–నా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలినవాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను 20సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు. 21అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పుకొనుచున్నాను. 22తరువాత–యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి–రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి 23అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. 24అయితే రాజు –అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరువుచేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.
25ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యముగలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను. 26తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను. 27అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి.
28అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలేములోనుండియు రాజదర్శనము చేయక యుండగా 29యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అత నిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లక పోగా 30అబ్షాలోము తన పనివారిని పిలిచి–యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా 31యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి–నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా 32అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను–గెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. 33అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారముచేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 సమూయేలు 14