2 రాజులు 3
3
1అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను. 2ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతాస్తంభమును తీసివేసెనుగాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను 3ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.
4మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. 5అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటుచేయగా 6యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను. 7యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి–మోయాబురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు–నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను. 8–మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు–ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను. 9ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితోకూడనున్నదండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. 10ఇశ్రాయేలురాజు–కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా 11యెహోషాపాతు–అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడు–ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన#3:11 ఏలీయాకు ఉపచారము చేయుచు వచ్చినప్రవక్తల యొద్దకు. షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా 12యెహోషాపాతు –యెహోవా ఆజ్ఞ యితనిద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలురాజును యెహోషాపాతును ఎదోమురాజును అతని యొద్దకుపోగా 13ఎలీషా ఇశ్రాయేలురాజును చూచి–నాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. –ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మాముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు 14ఎలీషా ఇట్లనెను–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుట కైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. 15నాయొద్దకు వీణె వాయించగల యొకనిని తీసికొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము#3:15 బలము. అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. 16– యెహోవా సెలవిచ్చినదేమనగా – ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి; 17యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. 18ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును. 19మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. 20ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. 21తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. 22ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను 23గనుక వారు–అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. 24వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. 25మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెనుగాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి. 26మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందలమందిని ఏర్పరచుకొని, ఎదోమురాజునొద్దకు తీసికొని పోవుటకు యత్నించెనుగాని అది వారివలన కాకపోయెను. 27అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలువారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.