2 రాజులు 20
20
1ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా 2అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని 3–యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 4యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 5–నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవదినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. 6ఇంక పదునయిదు సంవత్సరముల ఆయు ష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపా డుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను. 7పిమ్మట యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను. 8–యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవదినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను 9–తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా? 10అందుకు హిజ్కియా యిట్లనెను–నీడ పదిమెట్లు ముంద రికి నడుచుట అల్పముగాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును. 11ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను.
12ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగియైయుండిన సంగతి విని, పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా 13హిజ్కియా, దూతలు వచ్చినమాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములుగల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. 14పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి–ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని అడుగగా హిజ్కియా–బబులోనను దూరదేశమునుండి వారువచ్చియున్నారని చెప్పెను. 15–నీ యింటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా–నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను. 16అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చుమాట వినుము 17–వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు. 19అందుకు హిజ్కియా–నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞచొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగినయెడల మేలేగదా అని యెషయాతో అనెను. 20హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 21హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 20: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.