2 రాజులు 19

19
1హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి 2గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను. 3వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి–హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము; పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు. 4జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. 5రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా 6యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా –అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. 7అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.
8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను. 9అంతట కూషురాజైన తిర్హాకా తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను. 10యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి – యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము. 11ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా? 12నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారుగాని హారానువారు గాని, రెజెపులుగాని, తెలశ్శారులోనుండిన ఏదె నీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? 13హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? 14హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి 15యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను–యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవైయున్నావు. 16యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము. 17యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి 18వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. 19యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
20అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా – అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. 21అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా–సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. 22నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి? 23ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా.
నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర
ములకును
లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను
ఎత్తుగల దాని దేవదారు వృక్షములను
శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నాను
వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని
కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని
ప్రవేశించియున్నాను.
24నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను
నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్ని
టిని ఎండిపో జేసియున్నాను.
25నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు
పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు
నీకు వినబడలేదా?
ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ
లుగా చేయుట నావలననే సంభవించినది.
26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి
విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను
కాడవేయని చేలవలెను అయిరి.
27నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు
లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు
తెలిసేయున్నవి.
28నామీద నీవు వేయు రంకెలును
నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను
గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను.
నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను.
నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
29మరియు యెషయా చెప్పినదేమనగా – హిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
30యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. 31శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు; తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. 32కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు. 33ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు. 34నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
35ఆ రాత్రియే యెహోవాదూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్షయెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి. 36అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత 37అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించు కొనిపోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 19: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 రాజులు 19