1 సమూయేలు 6

6
1యెహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత 2ఫిలిష్తీయులు యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి–యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా 3వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందు రనిరి. 4ఫిలిష్తీయులు–మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు– మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. 5కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. 6ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములనుచేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా. 7కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి 8యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. 9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి. 10వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి 11యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములునుగల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా 12ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దువరకు పోయిరి. 13బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి. 14ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండియొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. 15లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను సమర్పించిరి. 16ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి.
17అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి. 18ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదు గురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనున్నది. 19బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబదివేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖా క్రాంతులైరి. 20అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధదేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి 21కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపి–ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 6: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి