1 సమూయేలు 5
5
1ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి 2దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. 3అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి. 4ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. 5కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడి గడపను త్రొక్కుటలేదు.
6యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతముచేయగా 7అష్డోదువారు సంభవించినదాని చూచి–ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్యనుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్యనుండకూడదని చెప్పుకొని 8ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొనిపోయిరి. 9అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను. 10వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి–మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి. 11కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందర్ని పిలువనంపించి –ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పెట్టి యుండెను. 12చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 5: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.