Logo YouVersion
Ikona Hľadať

ఆదికాండము 13

13
అబ్రాము కనానుకు తిరిగి వచ్చుట
1కనుక అబ్రాము ఈజిప్టును విడిచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేశాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు. 2ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.
3అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబును విడిచిపెట్టి మళ్లీ వెనుకకు బేతేలుకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. 4అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
అబ్రాము, లోతు వేరుపడటం
5ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. 6అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఆ భూమి సరిపోలేదు. 7అబ్రాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.
8కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం. 9మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నీవు ఎడమకు వెళ్తే, నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”
10లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్లు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొఱ్ఱాలను యెహోవా నాశనము చేయకముందు. ఆ కాలంలో సోయరు వరకు యొర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.) 11అందుచేత యొర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు. 12అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు. 13సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
14లోతు వెళ్లిపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు. 15నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది. 16భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది. 17కనుక వెళ్లు, నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”
18కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.

Zvýraznenie

Zdieľať

Kopírovať

None

Chceš mať svoje zvýraznenia uložené vo všetkých zariadeniach? Zaregistruj sa alebo sa prihlás