ఆదికాండము 12
12
దేవుడు అబ్రామును పిలచుట
1అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు,
“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు.
నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి,
నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
2నిన్ను ఆశీర్వదిస్తాను.
నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను.
నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను.
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు
నీ పేరు ఉపయోగిస్తారు.
3నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను.
నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను.
భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి
నేను నిన్ను ఉపయోగిస్తాను.”
అబ్రాము కనానుకు వెళ్లుట
4కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. 5అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు. 6అబ్రాము కనాను దేశంగుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.
7అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు.
ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. 8తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు. 9ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు#12:9 నెగెబు దక్షిణ పాలస్తీనాకు “నెగెవ్” అని పేరు. దిశగా అతడు ప్రయాణం చేశాడు.
ఈజిప్టులో అబ్రాము
10ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక ఏ పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించటానికి ఈజిప్టుకు వెళ్లాడు. 11తన భార్య శారయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము శారయితో ఇలా చెప్పాడు: “నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు. 12ఈజిప్టీయులు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ అతని భార్య అని వాళ్లు అంటారు. తర్వాత వాళ్లు నిన్ను ఆశించి నన్ను చంపేస్తారు. 13కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్లు నన్ను చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకొంటారు గనుక వాళ్లు నామీద దయ చూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు.”
14కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించాడు. శారయి చాలా అందగత్తె అని ఈజిప్టు ప్రజలు చూశారు. 15ఈజిప్టు నాయకులు కూడ కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తె అని ఫరోతో వాళ్లు చెప్పారు. ఆ నాయకులు శారయిని ఫరో యింటికి తీసుకెళ్లారు. 16శారయికి అబ్రాము సోదరుడు అనుకొని ఫరో అబ్రాము మీద దయ చూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకురాండ్రు, ఒంటెలను కూడా అబ్రాముకు ఇచ్చాడు.
17అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు. కనుక ఫరోకు అతని ఇంటిలోని మనుష్యులందరికి చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్లు యెహోవా చేశాడు. 18అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు, “నీవు నాకు చాలా అపకారం చేశావు. శారయి నీ భార్య అని నాతో ఎందుకు నీవు చెప్పలేదు? 19ఈమె నీ సోదరి అని చెప్పావు. నీవు ఎందుకలా చెప్పావు? ఆమె నా భార్యగా ఉండాలని అమెను నేను తీసుకొన్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరల నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఆమెను తీసుకొని వెళ్లిపో!” 20తర్వాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించి వేయమని ఫరో తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్లిపోయారు.
Aktuálne označené:
ఆదికాండము 12: TERV
Zvýraznenie
Zdieľať
Kopírovať

Chceš mať svoje zvýraznenia uložené vo všetkých zariadeniach? Zaregistruj sa alebo sa prihlás
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International