Logotipo da YouVersion
Ícone de Pesquisa

ఆది 48

48
మనష్షే ఎఫ్రాయిం
1కొంతకాలం తర్వాత, “నీ తండ్రి అస్వస్థతతో ఉన్నాడు” అని యోసేపుకు చెప్పబడింది. కాబట్టి తన ఇద్దరు కుమారులు, మనష్షేను ఎఫ్రాయిమును తీసుకెళ్లాడు. 2“నీ కుమారుడు, యోసేపు నీ దగ్గరకు వచ్చాడు” అని యాకోబుకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకుని పడక మీద కూర్చున్నాడు.
3యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల#48:3 హెబ్రీలో ఎల్-షద్దాయ్ దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి, 4‘నేను నిన్ను ఫలవంతం చేస్తాను, నీ సంఖ్యను పెంచుతాను. నేను నిన్ను ప్రజల సమాజంగా చేస్తాను, నీ తర్వాత నీ వారసులకు ఈ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అని అన్నారు.
5“కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు. 6వారి తర్వాత నీకు పిల్లలు పుడితే వారు నీ సంతానమవుతారు; వారు వారసత్వంగా పొందిన భూభాగంలో వారు తమ సోదరుల పేర్లతో లెక్కించబడతారు. 7నేను పద్దన#48:7 అంటే, వాయువ్య మెసపొటేమియా నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.”
8ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.
9“వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు.
అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు.
10ఇశ్రాయేలు వృద్ధాప్యంలో ఉన్నందుకు దృష్టి మందగించింది కాబట్టి అతడు చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు తన కుమారులను అతనికి సమీపంగా తెచ్చాడు, తన తండ్రి వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
11ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు.
12అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు. 13యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు. 14అయితే ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా త్రిప్పి చిన్నవాడైన ఎఫ్రాయిం తలపై తన కుడిచేతిని మొదటి కుమారుడైన మనష్షే తలపై తన ఎడమ చేతిని పెట్టాడు.
15అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు,
“నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు
ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు,
నేటి వరకు నా జీవితమంతా
నాకు కాపరిగా ఉన్న దేవుడు,
16నన్ను ప్రతి హాని నుండి విడిపించిన దూత
ఈ బాలురను దీవించును గాక.
వారు నా నామాన నా పితరులైన
అబ్రాహాము ఇస్సాకుల నామాన పిలువబడుదురు గాక,
భూమిపై వారు గొప్పగా విస్తరించుదురు గాక.”
17తన తండ్రి ఎఫ్రాయిం తలపై కుడిచేయి పెట్టడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు; ఎఫ్రాయిం తలపై నుండి మనష్షే తలపైకి చేయి మార్చడానికి తన తండ్రి చేతిని పట్టుకున్నాడు. 18యోసేపు అతనితో, “లేదు, నా తండ్రి, ఇతడు మొదటి కుమారుడు; ఇతని తలపై నీ కుడిచేయిని పెట్టు” అన్నాడు.
19కాని అతని తండ్రి ఒప్పుకోకుండా, “నాకు తెలుసు, నా కుమారుడా, నాకు తెలుసు, అతడు కూడా జనాల సమూహమై గొప్పవాడవుతాడు. అయినా, అతని తమ్ముడు అతనికంటే గొప్పవాడవుతాడు, అతని వారసులు జనాల సమూహం అవుతారు” అని చెప్పాడు. 20అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు,
“నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు:
‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ”
కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు.
21తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మీతో ఉంటారు. మిమ్మల్ని తిరిగి మీ పూర్వికుల స్థలమైన కనానుకు తిరిగి తీసుకెళ్తారు. 22నీ సోదరులకంటే ఎక్కువగా ఒక కొండ ప్రాంతం, నా ఖడ్గం, నా విల్లుతో అమోరీయుల దగ్గర నుండి తీసుకున్న కొండ ప్రాంతాన్ని నీకు ఇస్తున్నాను” అని చెప్పాడు.

Atualmente Selecionado:

ఆది 48: TSA

Destaque

Compartilhar

Copiar

None

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login