ఆది 46
46
యాకోబు ఈజిప్టుకు వెళ్లుట
1కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు.
2రాత్రి దర్శనం ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడారు. ఆయన, “యాకోబూ! యాకోబూ!” అని పిలిచారు.
అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
3ఆయన, “నేను దేవున్ని, నీ తండ్రి యొక్క దేవున్ని. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 4నేను నీతో ఈజిప్టుకు వస్తాను, ఖచ్చితంగా నిన్ను తిరిగి తీసుకువస్తాను. యోసేపు స్వహస్తాలే నీ కళ్లు మూస్తాయి” అని అన్నారు.
5అప్పుడు యాకోబు బెయేర్షేబ నుండి బయలుదేరాడు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును, వారి పిల్లలను, వారి భార్యలను ఫరో పంపిన బండ్లలో తీసుకెళ్లారు. 6కాబట్టి యాకోబు, అతని సంతానమంతా వారి పశువులతో, కనానులో వారు సంపాదించిన సమస్త సంపదతో ఈజిప్టుకు వెళ్లారు. 7యాకోబు తనతో తన కుమారులను, మనవళ్లను, కుమార్తెలను, మనవరాళ్లను, తన సంతానమంతటిని ఈజిప్టుకు తీసుకువచ్చాడు.
8ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల (యాకోబు అతని సంతానం) పేర్లు:
రూబేను, యాకోబు యొక్క మొదటి కుమారుడు.
9రూబేను కుమారులు:
హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
10షిమ్యోను కుమారులు:
యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ యొక్క కుమారుడైన షావూలు.
11లేవీ కుమారులు:
గెర్షోను, కహాతు, మెరారి.
12యూదా కుమారులు:
ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు).
పెరెసు కుమారులు:
హెస్రోను, హామూలు.
13ఇశ్శాఖారు కుమారులు:
తోలా, పువా, యోబు, షిమ్రోను.
14జెబూలూను కుమారులు:
సెరెదు, ఏలోను, యహలేలు.
15వీరు పద్దనరాములో లేయాకు యాకోబుకు పుట్టిన కుమారులు, దీనా వారి కుమార్తె. కుమారులు, కుమార్తెలు కలిసి వీరంతా ముప్పై ముగ్గురు.
16గాదు కుమారులు:
సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోది, అరేలీ.
17ఆషేరు కుమారులు:
ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి.
బెరీయా కుమారులు:
హెబెరు, మల్కీయేలు.
18వీరు లాబాను తన కుమార్తె లేయాకు ఇచ్చిన జిల్పా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం పదహారు మంది.
19యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు:
యోసేపు, బెన్యామీను.
20ఈజిప్టులో యోసేపుకు ఓను#46:20 అంటే, హెలియోపొలిస్ పట్టణానికి యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతు ద్వారా మనష్షే, ఎఫ్రాయిం పుట్టారు.
21బెన్యామీను కుమారులు:
బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.
22వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది.
23దాను కుమారుడు:
హూషీము.
24నఫ్తాలి కుమారులు:
యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.
25వీరు లాబాను తన కుమార్తె రాహేలుకు ఇచ్చిన బిల్హా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం ఏడుగురు.
26యాకోబుతో ఈజిప్టుకు అతని కుమారుల భార్యలు కాక, యాకోబు సంతతివారు మొత్తం అరవై ఆరు మంది వ్యక్తులు. 27ఈజిప్టులో యోసేపుకు పుట్టిన కుమారులు ఇద్దరితో కలిపి, ఈజిప్టుకు వెళ్లిన యాకోబు కుటుంబీకులంతా డెబ్బైమంది.#46:27 పాత నిబంధన గ్రీకులో డెబ్బై అయిదు
28గోషేనుకు త్రోవ చూపడానికి యాకోబు యూదాను తనకన్నా ముందు యోసేపు దగ్గరకు పంపాడు. వారు గోషేను ప్రాంతం చేరుకున్నప్పుడు, 29యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషేనుకు వెళ్లాడు. యోసేపు కనుపరచుకున్న వెంటనే, తన తండ్రిని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు.
30ఇశ్రాయేలు యోసేపుతో, “నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను కళ్లారా చూశాను కాబట్టి, ఇప్పుడు హాయిగా చనిపోగలను” అని అన్నాడు.
31అప్పుడు యోసేపు తన సోదరులతో తన తండ్రి ఇంటివారితో, “నేను వెళ్లి ఫరోతో మాట్లాడి అతనికి, ‘కనాను దేశంలో నివసించే నా సోదరులు, నా తండ్రి ఇంటివారు నా దగ్గరకు వచ్చారు. 32ఈ మనుష్యులు కాపరులు; వారు పశువులను మేపుతారు, వారు తమ మందలను, పశువులను, వారికి ఉన్నదంతా తెచ్చారు’ అని చెప్తాను. 33ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే, 34‘మీ సేవకులు మా పితరులు చేసినట్టే బాల్యం నుండి పశువులను మేపేవారము’ అని జవాబివ్వాలి. అప్పుడు గోషేనులో స్థిరపడడానికి మీకు అనుమతి వస్తుంది, ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఈజిప్టువారికి అసహ్యం” అని చెప్పాడు.
Atualmente Selecionado:
ఆది 46: TSA
Destaque
Compartilhar
Copiar

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.