ఆది 34
34
దీనా, షెకెమీయులు
1యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తెయైన దీనా ఆ దేశంలోని యువతులను దర్శించడానికి వెళ్లింది. 2ఆ ప్రాంత పాలకుడు, హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 3అతడు యాకోబు కుమార్తె దీనాపై మనస్సు పడ్డాడు; ఆ యువతిని అతడు ప్రేమించాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. 4షెకెము తన తండ్రి హమోరుతో, “ఈ అమ్మాయిని నాకు భార్యగా చేయండి” అని అన్నాడు.
5యాకోబు తన కుమార్తెయైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది అని విన్నప్పుడు, అతని కుమారులు తన మందతో పొలంలో ఉన్నారు; కాబట్టి వారు ఇంటికి వచ్చేవరకు అతడు ఏమి చేయలేదు.
6అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు. 7ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు.
8కానీ హమోరు వారితో, “నా కుమారుడు షెకెము మీ కుమార్తె మీద మనస్సు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికి భార్యగా ఇవ్వండి. 9మనం వియ్యమందుకుందాం; మీ కుమార్తెలను మాకు, మా కుమార్తెలను మీకు ఇచ్చి పుచ్చుకుందాము. 10మీరు మాతో నివసించవచ్చు, ఈ దేశం మీ ఎదుట ఉంది. ఇక్కడ ఉండండి, వ్యాపారం#34:10 లేదా స్వేచ్ఛగా తిరగవచ్చు; ఆది 34:21 చేయండి, ఆస్తి సంపాదించండి” అని అన్నాడు.
11తర్వాత షెకెము దీనా తండ్రితో, సోదరులతో, “మీ దృష్టిలో నేను దయ పొందితే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. 12వధువు కట్నం, నేను తెచ్చే బహుమానం ఎంతైనా సరే, మీరు అడిగింది నేను ఇస్తాను. యువతిని మాత్రం నాకు భార్యగా ఇవ్వండి” అని అడిగాడు.
13వారి సోదరియైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది కాబట్టి యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో మోసపూరితంగా జవాబిచ్చారు. 14వారు అన్నారు, “అలా మేము చేయలేము; సున్నతిలేని మనుష్యునికి మా సోదరిని ఇవ్వలేము. మాకది అవమానము. 15ఒక షరతుతో మాత్రమే మీతో ఒప్పందం లోనికి వస్తాం; మీ మగవారందరు సున్నతి చేసుకుని మాలాగా మారాలి. 16అప్పుడు మా కుమార్తెలను మీకు ఇస్తాము, మీ కుమార్తెలను మేము తీసుకుని మీతో నివసిస్తాం, మీతో ఒకే ప్రజలుగా అవుతాము. 17మీరు సున్నతి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, మా సోదరిని తీసుకుని వెళ్లిపోతాము.”
18వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది. 19ఆ యువకుడు, తన తండ్రి ఇంటి అంతటిలో ఘనత పొందినవాడు, యాకోబు కుమార్తె దీనాను ఎంతో కోరుకున్నాడు కాబట్టి వారు చెప్పింది చేయడానికి ఆలస్యం చేయలేదు. 20కాబట్టి హమోరు అతని కుమారుడు షెకెము వారి పట్టణ నాయకులతో మాట్లాడడానికి పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లారు. 21“ఈ మనుష్యులు మనతో స్నేహంగా ఉంటున్నారు” అని వారు అన్నారు. “వారిని మన దేశంలో నివసిస్తూ, వ్యాపారం చేయనిద్దాం; దేశంలో వారి కోసం చాల స్థలం ఉంది. మనం వారి కుమార్తెలను పెళ్ళి చేసుకుందాం, వారు మన వారిని చేసుకుంటారు. 22అయితే వారు మనతో నివసిస్తూ, మనతో ఒకే ప్రజలుగా ఉండాలంటే మన మగవారందరు వారిలా సున్నతి చేసుకోవాలని ఒక షరతు పెట్టారు. 23వారి పశువులు, వారి ఆస్తులు, వారి జంతువులన్నీ మనవి అవుతాయి కదా! కాబట్టి వారి షరతులు ఒప్పుకుందాము, వారు మన మధ్య స్థిరపడతారు.”
24పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లిన మనుష్యులందరు హమోరు, అతని కుమారుడైన షెకెముతో ఏకీభవించారు, పట్టణంలో ప్రతి మగవాడు సున్నతి పొందాడు.
25మూడు రోజుల తర్వాత, వారు ఇంకా నొప్పితో ఉండగా, యాకోబు కుమారులలో ఇద్దరు, దీనా సోదరులు షిమ్యోను, లేవీ వారి ఖడ్గాలు తీసుకుని, క్షేమంగా ఉన్నాం అని దాడిని కూడా ఊహించని పట్టణం మీద దాడి చేసి, ప్రతి పురుషుని చంపేశారు. 26వారు హమోరును, అతని కుమారుడైన షెకెమును ఖడ్గంతో చంపి, షెకెము ఇంటి నుండి దీనాను తీసుకెళ్లారు. 27యాకోబు కుమారులు వారిని చంపి, తమ సోదరి అపవిత్రం చేయబడిన పట్టణాన్ని దోచుకున్నారు. 28వారి మందలను, పశువులను, గాడిదలను, వారి పట్టణంలో, పొలాల్లో ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు. 29వారి ధనమంతటిని, వారి స్త్రీలనందరిని, పిల్లలందరిని తీసుకెళ్లి, వారి ఇండ్లలో ఉన్నదంతటిని దోచుకున్నారు.
30అప్పుడు యాకోబు షిమ్యోను, లేవీతో అన్నాడు, “ఈ దేశంలో నివసించే కనానీయులు, పెరిజ్జీయులు నన్ను చెడ్డవానిగా చూసేలా ఈ కష్టం నా మీదికి తెచ్చారు. మేము కొద్ది మందిమి, ఒకవేళ వారు ఏకమై నా మీద దాడి చేస్తే, నేను నా ఇంటివారు నాశనమవుతాము.”
31అయితే వారు, “మా సోదరి వేశ్యగా పరిగణించబడాలా?” అని జవాబిచ్చారు.
Atualmente Selecionado:
ఆది 34: TSA
Destaque
Compartilhar
Copiar

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.