Logotipo da YouVersion
Ícone de Pesquisa

ఆది 32

32
యాకోబు ఏశావును కలవడానికి సిద్ధపడుట
1యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు. 2యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము#32:2 మహనయీము అంటే రెండు సేనలు అని పెట్టారు.
3యాకోబు ఎదోము దేశంలోని శేయీరు ప్రాంతంలో ఉన్న తన సోదరుడైన ఏశావు దగ్గరకు తనకంటే ముందు దూతలను పంపాడు. 4ఆయన వారికి ఇలా సూచించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఇలా చెప్పాలి: ‘మీ సేవకుడైన యాకోబు చెప్తున్నాడు, ఇంతవరకు నేను లాబాను దగ్గరే ఉన్నాను. 5నాకు మందలు గాడిదలు గొర్రెలు మేకలు, దాసదాసీలు ఉన్నారు. నీ దృష్టిలో దయ పొందడానికి ఇప్పుడు నా ప్రభువుకు ఈ వర్తమానం పంపుతున్నాను.’ ”
6ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు.
7ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. 8“ఒకవేళ ఏశావు ఒక గుంపు మీద దాడి చేస్తే, ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు” అని అతడు అనుకున్నాడు.
9తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా, 10మీరు మీ సేవకునికి చూపిన దయ నమ్మకత్వానికి నేను యోగ్యుడను కాను. నేను యొర్దాను దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా అయ్యాను. 11దేవా, నా సోదరుడు ఏశావు చేతిలో పడకుండ నన్ను తప్పించు, ఎందుకంటే అతడు వచ్చి నన్ను, నా పిల్లలను వారి తల్లులతో పాటు చంపేస్తాడని నాకు భయమేస్తుంది. 12కానీ మీరు, ‘నేను ఖచ్చితంగా నిన్ను వృద్ధి చేసి నీ సంతానాన్ని లెక్కించబడలేని సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తాను’ అని అన్నారు” అని ప్రార్థన చేశాడు.
13ఆ రాత్రి యాకోబు అక్కడే గడిపి తన దగ్గర ఉన్న దాంట్లో నుండి తన అన్నయైన ఏశావుకు కానుక ఇవ్వడానికి పెట్టినవి: 14రెండువందల మేకలు, ఇరవై మేకపోతులు, రెండువందల గొర్రెలు, ఇరవై పొట్టేళ్లు, 15ముప్పై పాడి ఒంటెలు వాటి పిల్లలు, నలభై ఆవులు, పది ఎద్దులు, ఇరవై ఆడగాడిదలు, పది మగ గాడిదలు. 16వాటిని మందలు మందలుగా విభజించి, తన సేవకులకు అప్పగించి, తన సేవకులతో, “మంద మందకు నడుమ ఖాళీ ఉంచి, నాకంటే ముందుగా వెళ్లండి” అని అన్నాడు.
17వారిలో మొదట నిలబడి ఉన్నవాన్ని ఇలా హెచ్చరించాడు: “నా సోదరుడు ఏశావు మీకు ఎదురై, ‘నీవు ఎవరి సంబంధివి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు ఉన్న ఈ జంతువులన్నీ ఎవరివి?’ అని అడిగితే, 18అప్పుడు నీవు ఇలా చెప్పాలి, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, నా ప్రభువైన ఏశావుకు కానుకగా పంపబడ్డాయి, అతడు వెనుక వస్తున్నాడు.’ ”
19అతడు మందల వెంట వెళ్తున్న రెండవ వానికి, మూడవ వానికి, మిగతా అందరికి అలాగే సూచించాడు: “మీరు ఏశావును కలిసినప్పుడు అతనితో ఇలాగే చెప్పాలి. 20నీవు తప్పకుండ ఈ మాట చెప్పాలి, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనుక వస్తున్నాడు.’ ” ఎందుకంటే అతడు, “నేను ముందుగా పంపుతున్న ఈ బహుమతులతో నేను అతన్ని శాంతింపజేస్తాను; తర్వాత, నేను అతన్ని చూసినప్పుడు, బహుశ అతడు నన్ను చేర్చుకుంటాడు” అని అనుకున్నాడు. 21కాబట్టి యాకోబు బహుమతులు తనకు ముందుగా వెళ్లాయి, అయితే తాను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉన్నాడు.
యాకోబు దేవునితో పెనుగులాడతాడు
22ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుగురు పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి వెళ్లాడు. 23వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. 24యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు. 25అతన్ని గెలవలేనని ఆ మనుష్యుడు గ్రహించి, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. ఆ మనుష్యునితో పోరాడినందున యాకోబు తొడగూడు సడలింది. 26అప్పుడు అతడు, “నన్ను వెళ్లనివ్వు, తెల్లవారింది” అన్నాడు.
కానీ యాకోబు, “నన్ను దీవిస్తేనే గాని, నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు.
27అప్పుడు ఆ మనుష్యుడు, “నీ పేరేంటి?” అని అడిగాడు.
అందుకతడు, “యాకోబు” అని జవాబిచ్చాడు.
28అప్పుడు ఆ మనుష్యుడు, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు,#32:28 ఇశ్రాయేలు బహుశ అర్థం అతడు దేవునితో పోరాడతాడు ఎందుకంటే నీవు దేవునితో, మనుష్యులతో పోరాడి గెలిచావు” అని అన్నాడు.
29యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.”
కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.
30యాకోబు ఆ స్థలానికి పెనీయేలు#32:30 పెనీయేలు అంటే దేవుని ముఖం అని పేరు పెట్టి, “నేను దేవున్ని ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణం దక్కింది” అని అన్నాడు.
31యాకోబు పెనీయేలు#32:31 హెబ్రీలో పెనూయేలు అంటే పెనీయేలు నుండి వెళ్లే సమయంలో సూర్యోదయం అయ్యింది, అతడు తొడకుంటుతూ నడిచాడు. 32కాబట్టి యాకోబు తొడగూటి మీది తుంటినరం మీద దెబ్బ తిన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయులు నేటి వరకు తొడగూటి మీద ఉన్న తుంటినరం తినరు.

Atualmente Selecionado:

ఆది 32: TSA

Destaque

Compartilhar

Copiar

None

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login