Logotipo da YouVersion
Ícone de Pesquisa

నిర్గమ 4

4
మోషే కోసం గుర్తులు
1అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు.
2అప్పుడు యెహోవా అతనితో, “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని అన్నారు.
“ఒక కర్ర” అని అతడు జవాబిచ్చాడు.
3అందుకు యెహోవా, “దానిని నేలపై పడవేయి” అన్నారు.
మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు. 4అప్పుడు యెహోవా, “నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు” అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది. 5అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు.
6యెహోవా, “నీ చేతిని నీ ఛాతీ మీద పెట్టు” అన్నారు. మోషే తన చేతిని తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీయగా, అది కుష్ఠురోగంతో#4:6 కుష్ఠురోగం కుష్ఠురోగం కోసం వాడబడే హెబ్రీ పదం వివిధ రకాల చర్మ వ్యాధులకు వాడబడుతుంది. మంచులా తెల్లగా మారిపోయింది.
7“ఇప్పుడు నీ చేయి మరలా నీ ఛాతీ మీద పెట్టు” అని ఆయన అన్నారు. మోషే తన చేతిని మరలా తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీసినప్పుడు, అది తిరిగి మంచిదిగా, మిగితా దేహంలా అది మారింది.
8అప్పుడు యెహోవా, “వారు నిన్ను నమ్మకపోయినా మొదటి అసాధారణ గుర్తును లక్ష్యపెట్టకపోయినా, రెండవదానిని బట్టి నమ్మవచ్చు. 9అయితే వారు ఈ రెండు అసాధారణ గుర్తులను కూడా నమ్మకపోయినా లేదా నీ మాట వినకపోయినా, నీవు నైలు నది నుండి కొంచెం నీరు తీసుకుని పొడినేల మీద పోయి. నీవు నది నుండి తీసుకున్న నీరు నేలమీద రక్తంగా మారుతుంది” అని చెప్పారు.
10అప్పుడు మోషే యెహోవాతో, “ప్రభువా, నీ సేవకుని క్షమించు. గతంలో కాని నీవు నీ సేవకునితో మాట్లాడినప్పటినుండి కాని నేను ఎప్పుడూ మాటకారిని కాదు. నేను నత్తివాన్ని నా నాలుక సరిగా తిరగదు” అన్నాడు.
11యెహోవా అతనితో అన్నారు, “మానవులకు నోరు ఇచ్చింది ఎవరు? వారిని చెవిటివారిగా మూగవారిగా చేసింది ఎవరు? వారికి చూపును ఇచ్చింది, గ్రుడ్డివారిగా చేసింది ఎవరు? యెహోవానైన, నేను కాదా? 12కాబట్టి వెళ్లు; నేను సహాయం చేస్తాను, ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను.”
13కాని మోషే, “ప్రభువా, నీ సేవకుని క్షమించండి. దయచేసి మరొకరిని పంపించండి” అన్నాడు.
14అప్పుడు యెహోవా కోపం మోషేపై కోపం రగులుకుంది, ఆయన అన్నారు, “లేవీయుడైన నీ అన్న అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. అతడు నిన్ను కలుసుకోడానికి వస్తున్నాడు. నిన్ను చూసి అతడు సంతోషిస్తాడు. 15నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను. మీరు మాట్లాడడానికి సహాయం చేస్తాను, అలాగే మీరేమి చేయాలో నేను మీకు బోధిస్తాను. 16అతడే నీ బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతడు నీకోసం మాట్లాడే వాడిగా ఉంటాడు, నీవు అతనికి దేవునిలా ఉంటావు. 17ఈ కర్రను నీ చేతితో పట్టుకో, దీనితో నీవు అసాధారణ గుర్తులు చేయగలవు” అన్నారు.
ఈజిప్టుకు తిరిగి వెళ్లిన మోషే
18ఆ తర్వాత మోషే తన మామయైన యెత్రో దగ్గరకు తిరిగివెళ్లి అతనితో, “నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల దగ్గరకు తిరిగివెళ్లి వారిలో ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూడడానికి నన్ను వెళ్లనివ్వు” అన్నాడు.
అందుకు యెత్రో, “సమాధానం కలిగి, వెళ్లు” అన్నాడు.
19తర్వాత యెహోవా మిద్యానులో మోషేతో, “నిన్ను చంపడానికి చూసినవారందరు చనిపోయారు కాబట్టి నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లు” అన్నారు. 20కాబట్టి మోషే తన భార్య పిల్లలను తీసుకుని గాడిద మీద ఎక్కించి ఈజిప్టుకు తిరిగి ప్రయాణమయ్యాడు. అతడు దేవుని కర్రను తన చేతిలో పట్టుకున్నాడు.
21అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లిన తర్వాత, నేను నీకు చేయడానికి శక్తినిచ్చిన ఇచ్చిన అద్భుతాలన్నిటిని ఫరో ఎదుట నీవు చేయాలి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వడు. 22అప్పుడు నీవు ఫరోతో, ‘యెహోవా నాతో ఇలా చెప్పారు: ఇశ్రాయేలు నా మొదటి సంతానమైన కుమారుడు, 23“నన్ను సేవించేలా నా కుమారుని వెళ్లనివ్వు” అని నీకు చెప్పాను. కాని నీవు వారిని పంపడానికి నిరాకరించావు; కాబట్టి నేను నీ మొదటి సంతానమైన నీ కుమారున్ని చంపుతాను.’ ”
24ప్రయాణ మార్గంలో వారు బసచేసిన చోటు దగ్గర యెహోవా మోషేను ఎదుర్కొని అతన్ని చంపబోయారు. 25అయితే సిప్పోరా ఒక చెకుముకి కత్తిని తీసుకుని, తన కుమారుని యొక్క మర్మాంగ చర్మం యొక్క కొనను కత్తిరించుట ద్వార సున్నతిచేసి, దానితో మోషే పాదాలను తాకించి, “నీవు నాకు రక్తసంబంధమైన భర్తవు” అన్నది. 26అప్పుడు యెహోవా అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు “రక్తసంబంధమైన భర్తవయ్యావు” అన్నది.
27యెహోవా అహరోనుతో, “మోషేను కలవడానికి అరణ్యంలోనికి వెళ్లు” అని అన్నారు. కాబట్టి అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. 28అప్పుడు మోషే తనను పంపించిన యెహోవా చెప్పమన్న వాటన్నిటిని, ఆయన తనను చేయమని ఆజ్ఞాపించిన సూచనలన్నింటిని గురించి అహరోనుకు చెప్పాడు.
29అప్పుడు మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి, 30యెహోవా మోషేకు చెప్పిన వాటన్నిటిని అహరోను పెద్దలందరికి తెలియజేశాడు. మోషే వారి ఎదుట ఆ అసాధారణమైన సూచకక్రియలను చేశాడు, 31అప్పుడు వారు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను పట్టించుకున్నాడని తమ బాధలను చూశాడని విని వారు తమ తలలు వంచి ఆరాధించారు.

Atualmente Selecionado:

నిర్గమ 4: TSA

Destaque

Compartilhar

Copiar

None

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login

Vídeo para నిర్గమ 4