నిర్గమ 14
14
1తర్వాత యెహోవా మోషేతో అన్నారు, 2“ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు. 3ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వారు ఈ దేశంలో కలవరంతో దారితప్పి తిరుగుతున్నారని, ఎడారిలో చిక్కుకున్నారని’ అనుకుంటాడు. 4నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను కాబట్టి అతడు వారిని వెంటాడుతాడు. కాని ఫరో, అతని సైన్యం వలన నాకు మహిమ కలుగుతుంది. నేను యెహోవానై యున్నానని ఈజిప్టువారందరు తెలుసుకుంటారు.” కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు.
5ప్రజలు పారిపోయారని ఈజిప్టు రాజుకు తెలియజేసినప్పుడు, వారి గురించి ఫరో అతని సేవకులు తమ మనస్సులు మార్చుకొని, “మనమెందుకు ఇలా చేశాము? మనకు సేవలు చేయకుండా మనం ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చాము!” అని చెప్పుకొన్నారు. 6కాబట్టి అతడు తన రథాన్ని సిద్ధం చేసుకుని తనతో పాటు తన సైన్యాన్ని తీసుకెళ్లాడు. 7అతడు ప్రత్యేకమైన ఆరువందల రథాలను వాటితో పాటు ఈజిప్టులో ఉన్న ఇతర రథాలన్నిటిని ప్రతి దాని మీద అధిపతులతో తీసుకెళ్లాడు. 8యెహోవా ఈజిప్టు రాజైన ఫరో హృదయాన్ని కఠినం చేసినప్పుడు అతడు నిర్భయంగా వెళ్తున్న ఇశ్రాయేలీయులను వెంటాడాడు. 9ఈజిప్టువారు అంటే ఫరో యొక్క అన్ని గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు,#14:9 లేదా రథసారధులు; ఇంకా 17, 18, 23, 26, 28 వచనాల్లో దళాలు ఇశ్రాయేలీయులను వెంటాడి, వారిని దాటి బయల్-సెఫోను ఎదురుగా ఉన్న పీ హహీరోతుకు సమీపంలో సముద్రతీరాన బసచేసి వారిని పట్టుకోడానికి వచ్చారు.
10ఫరో దగ్గరగా వస్తుండగా, ఇశ్రాయేలీయులు పైకి చూసినప్పుడు ఈజిప్టువారు తమ వెనుక రావడం చూశారు. వారు భయపడి యెహోవాకు మొరపెట్టారు. 11వారు మోషేతో, “ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకువచ్చావా? ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి మాకు నీవు చేసిందేంటి? 12మమ్మల్ని వదిలిపెట్టు, మేము ఈజిప్టువారికి సేవచేసుకుంటామని ఈజిప్టులో మేము నీతో చెప్పలేక? ఈ ఎడారిలో చావడం కంటే ఈజిప్టువారికి సేవచేసుకోవడం మాకు మేలు కదా!” అన్నారు.
13అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు. 14యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.”
15అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపొమ్మని ఇశ్రాయేలీయులకు చెప్పు. 16నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు. 17నేను ఈజిప్టువారి హృదయాలను కఠినం చేస్తాను కాబట్టి వారు వీరి వెనుక వస్తారు. ఫరోను బట్టి అతని సైన్యమంతటిని బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలుగుతుంది. 18ఫరోను బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలిగినప్పుడు నేనే యెహోవానై యున్నానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.”
19అప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యానికి ముందు నడుస్తున్న దేవదూత వారి వెనుకకు వెళ్లాడు. మేఘస్తంభం కూడా వారి ఎదుట నుండి కదిలి వారి వెనుకకు వెళ్లి, 20ఈజిప్టువారి సైన్యానికి ఇశ్రాయేలీయుల సైన్యానికి మధ్య నిలబడింది. ఆ రాత్రంతా ఆ మేఘం ఈజిప్టువారికి చీకటి కలిగించింది కాని ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చింది కాబట్టి ఈజిప్టువారు వీరిని సమీపించలేదు.
21మోషే సముద్రం వైపు తన చేతిని చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలిచేత సముద్రాన్ని పాయలుగా చేసి దానిని ఆరిన నేలగా చేశారు. నీళ్లు రెండుగా విడిపోయాయి, 22ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచివెళ్లారు. వారి కుడి ఎడమల వైపు నీళ్లు గోడల వలె నిలబడ్డాయి.
23ఈజిప్టువారు వారిని వెంటపడ్డారు; ఫరో గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు అన్ని సముద్రం మధ్యలో వారిని వెంటాడాయి. 24తెల్లవారుజామున యెహోవా అగ్ని మేఘస్తంభం నుండి ఈజిప్టువారి సైన్యాన్ని చూసి ఆయన వారిని కలవరానికి గురి చేశారు. 25ఆయన వారి రథచక్రాలను ఇరక్కుపోయేలా#14:25 కొ.ప్ర.లో ఊడిపోయేలా చేయడంతో వాటిని నడపడం వారికి కష్టంగా ఉంది. అప్పుడు ఈజిప్టువారు, “ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం రండి! వారి పక్షంగా యెహోవా ఈజిప్టువారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పుకున్నారు.
26అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టువారి మీదికి వారి రథాల మీదికి వారి గుర్రపురౌతుల మీదికి నీళ్లు వచ్చేలా నీ చేయి సముద్రం మీద చాపు” అన్నారు. 27మోషే సముద్రం మీద తన చేయి చాపగా సూర్యోదయ సమయంలో సముద్రం తన స్థానంలోనికి తిరిగి వచ్చేసింది. ఈజిప్టువారు దాని నుండి పారిపోతున్నారు కాని యెహోవా వారిని సముద్రంలో ముంచివేసారు. 28నీళ్లు వెనుకకు ప్రవహించి సముద్రంలో ఇశ్రాయేలీయులను తరుముతున్న ఫరో సైన్యమంతటిని అంటే రథాలను గుర్రపురౌతులను కప్పివేశాయి. వారిలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.
29అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేలమీద వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె నిలబడ్డాయి. 30ఆ రోజు యెహోవా ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించారు. ఇశ్రాయేలీయులు సముద్రతీరాన చచ్చిపడివున్న ఈజిప్టువారిని చూశారు. 31ఈజిప్టువారికి వ్యతిరేకంగా పని చేసిన యెహోవా బలమైన హస్తాన్ని ఇశ్రాయేలీయులు చూచారు కాబట్టి ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా మీద ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకముంచారు.
Atualmente Selecionado:
నిర్గమ 14: TSA
Destaque
Compartilhar
Copiar

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.