Logotipo da YouVersion
Ícone de Pesquisa

నిర్గమ 1

1
ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు
1తమ కుటుంబాలతో యాకోబు వెంట ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు:
2రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;
3ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;
4దాను, నఫ్తాలి;
గాదు, ఆషేరు.
5యాకోబు సంతతివారందరు డెబ్బైమంది;#1:5 ఆది 46:27 కూడా చూడండి; మృత సముద్ర గ్రంథపుచుట్టలలో, పాత ఒడంబడిక గ్రీకు అనువాదంలో అపొ. కా. 7:14 కూడ చూడండి డెబ్బై అయిదు. అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.
6కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు, 7అయితే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ఫలించారు; వారు గొప్పగా విస్తరించారు, అభివృద్ధి చెందారు, వారి సంఖ్య అంతకంతకు అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితోనే నిండిపోయింది.
8కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు. 9అతడు తన ప్రజలతో, “చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యలో, బలంలో మనలను అధిగమించారు. 10మనం వారితో యుక్తిగా నడుచుకోవాలి, లేకపోతే వారి సంఖ్య ఇంకా అధికమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే వారు మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.
11కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు. 12అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి, 13వారి చేత వెట్టిచాకిరి చేయించారు. 14మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.
15ఈజిప్టు రాజు, షిఫ్రా పూయా అనే హెబ్రీ మంత్రసానులతో మాట్లాడుతూ, 16“హెబ్రీ స్త్రీలకు ప్రసవ సమయంలో కాన్పుపీట దగ్గర మీరు వారికి సహాయం చేస్తున్నప్పుడు పుట్టింది మగపిల్లవాడైతే వానిని చంపెయ్యండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి” అని అన్నాడు. 17అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమతో చెప్పింది చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారు. 18ఈజిప్టు రాజు ఆ స్త్రీలను పిలిపించి, “మీరెందుకు ఇలా చేశారు? మగపిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు?” అని వారిని అడిగాడు.
19అందుకు ఆ మంత్రసానులు, “హెబ్రీ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటివారు కారు; వారు బలం గలవారు, మంత్రసానులు వారి దగ్గరకు రావడానికి ముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు.
20కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల పట్ల దయ చూపించారు, ప్రజలు మరింత ఎక్కువగా విస్తరించారు. 21ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.
22అప్పుడు ఫరో, “హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగపిల్లవాన్ని నైలు నదిలో పడవేసి, ఒకవేళ ఆడపిల్లను అయితే బ్రతకనివ్వాలి” అని ఆజ్ఞాపించాడు.

Atualmente Selecionado:

నిర్గమ 1: TSA

Destaque

Compartilhar

Copiar

None

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login

Vídeo para నిర్గమ 1