ఆదికాండము 44
44
1యోసేపు ఆ మనుష్యుల గోనెలు పెట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, 2కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాటచొప్పున అతడు చేసెను.
3తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతోకూడ పంపివేయబడిరి. 4వారు ఆ పట్టణమునుండి బయలుదేరి యెంతో దూరము వెళ్లకమునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి – నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని–మీరు మేలుకు కీడుచేయనేల? 5దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను. 6అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు 7వారు–మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. 8ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితిమి; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము? 9నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునోవాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి. 10అందుకతడు–మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను. 11అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. 12అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. 13కావునవారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. 14అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి. 15అప్పుడు యోసేపు–మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా 16యూదా యిట్లనెను–ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనోవాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను. 17అందుకతడు–అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా 18యూదా అతని సమీపించి–ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా 19ఏలినవాడు–మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను. 20అందుకు మేము–మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. 21అప్పుడు తమరు–నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పి తిరి. 22అందుకు మేము–ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు.వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితిమి. 23అందుకు తమరు–మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. 24కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితిమి. 25మా తండ్రి–మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు 26మేము–అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతోకూడ ఉండినయెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనేగాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. 27అందుకు తమ దాసుడైన నా తండ్రి–నాభార్య నాకిద్దరిని కనెనని మీ రెరుగుదురు. 28వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగములచేత చీల్చ బడెనను కొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు. 29మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. 30కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల 31అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. 32-33తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి–నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నామీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము. 34ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.
Atualmente Selecionado:
ఆదికాండము 44: TELUBSI
Destaque
Compartilhar
Copiar

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.