Logotipo da YouVersion
Ícone de Pesquisa

ఆదికాండము 25

25
1అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసి కొనెను, ఆమె పేరు కెతూరా. 2ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. 3యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. 4ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరు కెతూరా సంతతివారు. 5అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను. 6అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. 7అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు. 8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను. 9హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది. 10అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి. 11అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
12ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే. 13ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నెబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము 14మిష్మా దూమా మశ్శా 15హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా 16ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులచొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు. 17ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పదియేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 18వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
19అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. 20ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు. 21ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. 22ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను–
23రెండు జనములు నీ గర్భములో కలవు.
రెండు జనపదములు నీ కడుపులోనుండి
ప్రత్యేకముగా వచ్చును.
ఒక జనపదముకంటె ఒక జనపదము
బలిప్ఠమై యుండును.
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
24ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. 25మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు#25:25 అనగా – రోమము లేక ఎఱ్ఱని. అను పేరు పెట్టిరి. 26తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు#25:26 అనగా – మడిమెను పట్టుకొనినవాడు లేక, మోసగాడు. అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు. 27ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 28ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను. 29ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండు కొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి 30–నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము#25:30 అనగా – ఎఱ్ఱని. అనబడెను. 31అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా 32ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను 33యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా 34యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడుతిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

Destaque

Compartilhar

Copiar

None

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login