మత్తయి 6

6
అవసరంలో ఉన్నవారికి సహాయపడుట
1“మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండా జాగ్రత్తపడండి. మీరు అలా చేస్తే, పరలోకంలోని మీ తండ్రి దగ్గర నుండి ఫలాన్ని పొందుకోరు.
2“కాబట్టి మీరు అవసరంలో ఉన్నవారికి ఇచ్చేటప్పుడు, ఇతరుల నుండి గౌరవించబడాలని, సమాజమందిరాల్లో, వీధుల్లో ప్రకటించుకొనే వేషధారుల్లా బూరలు ఊది ప్రకటించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 3అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేటప్పుడు, కుడి చెయ్యి చేసేది మీ ఎడమ చేతికి తెలియకూడదు. 4మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. అప్పుడు రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
ప్రార్థన
5“మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే సమాజమందిరాల్లో, వీధుల మూలల్లో నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 6అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసికొని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేసుకోండి. రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. 7మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే దేవుని ఎరుగని వారిలా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి. 8మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కనుక మీరు వారిలా ఉండకండి.
9“మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి:
“ ‘పరలోకమందున్న మా తండ్రీ,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
10మీ రాజ్యం వచ్చును గాక;
పరలోకంలో జరుగునట్లు భూమి మీద,
మీ చిత్తం జరుగును గాక.
11మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
12మరియు మా రుణస్థులను మేము క్షమించినట్లు,
మా రుణాలను క్షమించండి.
13మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి,
దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’
14మీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మీరు క్షమిస్తే, మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. 15ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.
ఉపవాసము
16“మీరు ఉపవాసం ఉన్నప్పుడు, తాము ఉపవాసం ఉంటున్నాం అని ఇతరులకు తెలియాలని తమ ముఖాలను నీరసంగా పెట్టుకొనే వేషధారుల్లా నీరసంగా ఉండవద్దు. అలా చేసినవారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 17అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కోండి. 18అప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని కనిపించని మీ తండ్రికి తప్ప, ఇతరులకు తెలియదు; రహస్యంగా చేసింది చూసే, మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
పరలోకంలో ధనం
19“భూమి మీద మీ కొరకు ధనాన్ని కూడపెట్టుకోకండి. ఇక్కడ దానికి చెదలు పట్టి, తుప్పు పట్టి నాశనం అవుతుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. 20అయితే మీ కొరకు పరలోకంలో ధనం కూడపెట్టుకోండి, అక్కడ చిమ్మెట గాని క్రిమికీటకాలుగాని నాశనం చేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. 21ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.
22“కన్ను దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే నీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. 23కాని నీ కన్ను అనారోగ్యంగా ఉంటే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుకే మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి కటిక చీకటై ఉంటుంది కదా!
24“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేక ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవుణ్ణి, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.
చింతించకండి
25“అందుకే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేక ఏమి ధరించాలి అని మీ దేహాన్ని గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి కావా? 26గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. వాటికన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు కారా? 27మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట#6:27 ఒక గంట లేదా మీ ఎత్తులో ఒక అడుగు పొడిగించుకోగలరా?
28“అలాంటప్పుడు మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. 29అయినను గొప్ప వైభవం కలిగివున్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. 30అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా అలంకరించరా? 31కనుక ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి. 32దేవుని ఎరుగని ప్రజలు అలాంటి వాటి వెంటపడతారు, కాని అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. 34కాబట్టి రేపటి గురించి చింతించకండి, ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపటి దినమే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు సరిపోతుంది.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj