మత్తయి 11

11
యేసు, బాప్తిస్మమిచ్చు యోహాను
1యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తర్వాత, ఆయన అక్కడి నుండి గలిలయలోని పట్టణాల్లో ఉపదేశించడానికి, సువార్తను ప్రకటించడానికి వెళ్లారు.
2క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి, 3“రావలసిన వాడవు నీవేనా, లేక మేము వేరొకరి కొరకు చూడాలా?” అని ఆయనను అడగమన్నాడు.
4యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి. 5గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. 6నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు.
7యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా? 8అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించిన వ్యక్తులు రాజభవనాల్లో ఉంటారు. 9మరి ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను. 10అతని గురించి ఇలా వ్రాయబడింది:
“ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను,
అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’#11:10 మలాకీ 3:1
11స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవానిగా ఎదిగినవారు ఒక్కరు లేరు; అయినప్పటికి, పరలోకరాజ్యంలో అందరికన్నా అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 12బాప్తిస్మమిచ్చు యోహాను రోజులనుండి ఇప్పటి వరకు పరలోక రాజ్యం హింసకు గురవుతూనే ఉంది, హింసించేవారు దానిపై దాడులు చేస్తూనే వున్నారు. 13యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రం, అలాగే ప్రవక్తలందరు ప్రవచించారు. 14మీరు అంగీకరించడానికి ఇష్టపడితే, ఇతడే ఆ రావలసిన ఏలీయా. 15వినడానికి చెవులుగలవారు విందురు గాక.
16“ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు సంతవీధుల్లో కూర్చుని ఇతరులను పిలుస్తూ:
17“ ‘మేము మీ కొరకు పిల్లనగ్రోవిని వాయించాం,
కాని మీరు నాట్యం చేయలేదు.
మేము విషాద గీతాన్ని పాడాం.
మీరు దుఃఖపడలేదు,’
అని చెప్పుకునే చిన్న పిల్లల్లా ఉంటారు.
18-19“ఎందుకంటే యోహాను తినకుండా త్రాగకుండా వచ్చాడు అయినా వారు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు. మనుష్యకుమారుడు తింటూ త్రాగుతూ వచ్చారు కనుక వారు, ‘ఇదిగో, తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు. కాని జ్ఞానం సరియైనదని దాని పనులను బట్టే నిరూపించబడుతుంది” అంటున్నారు.
పశ్చాత్తాపపడని పట్టణాలకు శ్రమ
20యేసు ఏ పట్టణాల్లో ఎక్కువ అద్బుతాలను చేశాడో ఆ పట్టణాలు పశ్చాత్తాపపడలేదని వాటిని నిందించడం మొదలుపెట్టారు. 21“కొరజీనూ నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్బుతాలు తూరు, సీదోను పట్టణాలలో జరిగివుంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడి ఉండేవారు. 22అయితే తీర్పు రోజున మీ మీదికి వచ్చే గతికంటే తూరు సీదోను పట్టణాల గతి సహించ గలిగినదిగా ఉంటుంది. 23ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు. నీలో జరిగిన అద్బుతాలు సొదొమలో జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేది. 24అయితే తీర్పు రోజున మీ మీదికి వచ్చే గతికంటే సొదొమ పట్టణానికి వచ్చే గతి సహించ గలిగినదిగా ఉంటుందని మీతో చెప్తున్నాను.”
తండ్రి కుమారునిలో ప్రత్యక్షపరచుకొనుట
25ఆ సమయంలో యేసు ఇలా అన్నారు, “తండ్రీ, భూమి ఆకాశములకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు, తెలివైనవారికి మరుగుచేసి, చిన్నపిల్లలకు బయలుపరిచావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. 26అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషం.
27“నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు; అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియజేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.
28“భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరందరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. 29నేను సౌమ్యుడను, దీనమనస్సు గలవాడిని కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. 30ఎందుకంటే, నా కాడి సుళువైనది, నా భారం తేలికైనది.”

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj