ఆది 6

6
లోకంలో దుష్టత్వం
1నరులు భూమిపై వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్న సమయంలో వారికి కుమార్తెలు పుట్టినప్పుడు, 2దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు. 3అప్పుడు యెహోవా, “నా ఆత్మ నరులతో నిరంతరం వాదించదు,#6:3 లేదా నా ఆత్మ వారిలో ఉండదు ఎందుకంటే వారు శరీరులు;#6:3 లేదా అవినీతిపరులు వారి బ్రతుకు దినాలు 120 సంవత్సరాలు అవుతాయి” అని అన్నారు.
4ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు#6:4 నెఫిలీములు అంటే ఆజానుబాహులు ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు.
5యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు. 6యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు. 7అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు. 8అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు.
నోవహు, జలప్రళయం
9నోవహు అతని కుటుంబం యొక్క వివరాలు:
నోవహు నీతిమంతుడు, అతని సమకాలికులలో అతడు నిందారహితుడు, దేవునితో నమ్మకంగా జీవించాడు. 10నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు.
11దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది. 12దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు. 13కాబట్టి దేవుడు నోవహుతో ఇలా అన్నారు, “నేను ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారిని బట్టి భూమి హింసతో నిండిపోయింది. నేను ఖచ్చితంగా వారిని, భూమిని నాశనం చేయబోతున్నాను. 14కాబట్టి నీకోసం తమాల వృక్ష చెక్కతో ఒక ఓడను నిర్మించుకో; దానిలో గదులు చేసి, దానికి లోపల బయట కీలు పూయాలి. 15దానిని నిర్మించవలసిన విధానం: ఆ ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండాలి.#6:15 దాదాపు 135 మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పు 14 మీటర్ల ఎత్తు 16దానికి పైకప్పు వేసి, మూర#6:16 దాదాపు 18 అంగుళాలు లేదా 45 సెం. మీ. కొలత క్రింద అన్ని మూలలు గల ఒక కిటికీ పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి, క్రింద, మధ్య, పై అంతస్తులు నిర్మించాలి. 17ఆకాశం క్రింద ఉన్న సమస్త జీవులను, జీవవాయువు గల ప్రతి ప్రాణిని నాశనం చేయడానికి నేను భూమి మీదికి జలప్రళయం తీసుకురాబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది. 18అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను, ఓడలో నీతో పాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ప్రవేశించాలి. 19మీతో పాటు బ్రతికి ఉండేలా జీవులన్నిటిలో మగ, ఆడవాటిని మీరు ఓడలోకి తీసుకురావాలి. 20ప్రతి జాతిలో రెండేసి పక్షులు, ప్రతి జాతిలో రెండేసి జంతువులు, ప్రతి జాతిలో నేలపై ప్రాకే ప్రాణులు బ్రతికి ఉండడానికి నీ దగ్గరకు వస్తాయి. 21నీకు, వాటికి తినడానికి ఆహారాన్ని అన్ని రకాల భోజనపదార్థాలు సమకూర్చుకోవాలి.”
22దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు.

Obecnie wybrane:

ఆది 6: TSA

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj