Kisary famantarana ny YouVersion
Kisary fikarohana

లూకా 23

23
1అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి 2–ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి. 3పిలాతు– నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను. 4పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను–ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. 5అయితే వారు–ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. 6పిలాతు ఈ మాట విని–ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి 7ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
8హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను. 9ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. 10ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి. 11హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను. 12అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
13అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి 14–ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు; 15హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. 16-17కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా 18వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి. 19వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. 20పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను 21వారు–వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి. 22మూడవ మారు అతడు–ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. 23అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. 24కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి 25అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
26వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
27గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్ర్తీలును ఆయనను వెంబడించిరి. 28యేసు వారివైపు తిరిగి–యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. 29ఇదిగో–గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి. 30అప్పుడు–మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. 31వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.
32మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.
33వారు కపాలమనబడిన#23:33 కల్వరి. స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి. 34యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. 35ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. 36అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి 37–నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. 38–ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.
39వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. 40అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 41మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి 42ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి#23:42 కొన్ని ప్రాచీన ప్రతులలో–నీ రాజ్యముతో అని పాఠాంతరము. వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. 43అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
44అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; 45సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. 46అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. 47శతాధిపతి జరిగినది చూచి–ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. 48చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. 49ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్ర్తీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
50అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. 51అతడు సజ్జనుడును నీతిమంతుడునైయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు. 52అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని 53దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుమునుపెప్పుడును ఉంచబడలేదు. 54ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతిదినారంభము కావచ్చెను. 55అప్పుడు గలిలయనుండి ఆయనతోకూడ వచ్చిన స్ర్తీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి 56తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.

Voafantina amin'izao fotoana izao:

లూకా 23: TELUBSI

Asongadina

Hizara

Dika mitovy

None

Tianao hovoatahiry amin'ireo fitaovana ampiasainao rehetra ve ireo nasongadina? Hisoratra na Hiditra