ఆదికాండము 8

8
1దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసి కొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను. 2అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకా శమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను. 3అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైనతరువాత నీళ్లు తగ్గిపోగా 4ఏడవ నెల పదియేడవదినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను. 5నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 6నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి 7ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను. 8మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను. 9నీళ్లు భూమి అంతటిమీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను. 10అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. 11సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. 12అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. 13మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 14రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను.
15-16అప్పుడు దేవుడు–నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి. 17పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతోకూడ నున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. 18కాబట్టి నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. 19ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను. 20అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను. 21అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి–ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. 22భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요