ఆదికాండము 39

39
1యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను. 2యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. 3యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతనిచేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు 4యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను. 5అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను. 6అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను. 7అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి–తనతో శయ నించుమని చెప్పెను 8అయితే అతడు ఒప్పక–నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు. 9నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. 10దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెనుగాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుట కైనను ఆమె మాట విన్నవాడుకాడు. 11అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. 12అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. 13అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు 14తన యింటి మనుష్యులను పిలిచి–చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకురాగా నేను పెద్దకేక వేసితిని. 15నేను బిగ్గరగా కేకవేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి 16అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచు కొనెను. 17అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను –నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను. 18నేను బిగ్గరగా కేక వేసినప్పుడువాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారి పోయెననెను 19కాబట్టి అతని యజమానుడు–ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి 20అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. 21అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. 22చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. 23యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణచేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요

ఆదికాండము 39 동영상